తనకు చంద్రబాబు నాయుడుతో వైరం ఉందని అందరూ అంటుంటారని.. అది నిజమే కానీ ఇప్పుడు కాదని మాజీ ఎంపీ దగ్గుబాటి వెంకటేశ్వర రావు చెప్పారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని, వాటిని మరిచిపోవాలన్నారు. ఎల్లకాలం పరుషంగా ఉండాల్సిన అవసరం లేదని వెంకటేశ్వర రావు పేర్కొన్నారు. దగ్గుబాటి రచించిన ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకావిష్కరణ కార్యక్రమం విశాఖ గీతం యూనివర్సిటీలో జరిగింది. ఈ కార్యక్రమంకు సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేదికపై తోడల్లుళ్లు చంద్రబాబు, వెంకటేశ్వర రావు ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.
‘ప్రపంచ చరిత్ర’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో దగ్గుబాటి వెంకటేశ్వర రావు మాట్లాడుతూ… ‘ఆంధ్ర రాష్ట్రం అనేకసార్లు విభనకు గురైంది. ఆ సందర్భంలో ఎదురైన పరిస్థితిని చర్చించే ప్రయత్నం చేశాను. రాజకీయ నాయకులు ఎప్పుడు స్వీయ చరిత్రలు, అనుభవాలు రాస్తుంటారు కానీ.. ప్రపంచ చరిత్రను రాసినప్పుడు బుక్ లాంఛ్ కోసం ప్రముఖులను పిలవడంపై సందిగ్ధత వుండేది. రాజకీయ నాయకులు అంటే ఎన్నికల్లో ఖర్చు పెట్టడం, తిరిగి సంపాదించడం అనే అభిప్రయంలోకి వెళ్ళిపోయింది. ప్రపంచ చరిత్ర పుస్తకం పోటీ పరీక్షలకు వెళ్లే వాళ్లకు ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నా’ అని అన్నారు.
‘వేదిక ఎక్కి 30 ఏళ్లు అయ్యింది. గతంలో మైక్ ముందు మాట్లాడమని అడిగినా వెళ్లి పోయేవాడిని. ఇవాళ బుక్ రిలీజ్ కోసం వచ్చాను. రాజకీయాలు, పుస్తక పరిచయం గురించి ప్రస్తావిస్తూ బోర్ కొట్టించానా?. మరో 50 ఏళ్లు బ్రతికే టెక్నాలజీ వచ్చేస్తుందట. నాకు, చంద్రబాబుకు వైరం ఉందని అందరూ అంటారు. అది నిజమే కానీ.. ఇప్పుడు కాదు. కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు, వాటిని మరిచిపోవాలి. ఎల్లకాలం పరుషంగా వుండాలిస్సిన అవసరం లేదు’ అని దగ్గుబాటి చెప్పుకొచ్చారు. దగ్గుబాటి మాట్లాడిన అనంతరం సీఎం చంద్రబాబు ఆయన్ను అభినందిస్తూ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఇద్దరూ ఒకే బహిరంగ వేదికపైకి రావడం 30 ఏళ్లలో ఇదే మొదటిసారి.