Minister Vangalapudi Anitha: బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను నేపథ్యంలో రాష్ట్రంలో ముందస్తు సహాయక చర్యలపై రాష్ట్ర హోంమంత్రి అనిత ఎన్టీవీతో మాట్లాడారు. ముఖ్యమంత్రి గత నాలుగు రోజులుగా తుపాను ముప్పుపై అన్ని శాఖలను అప్రమత్తం చేస్తూ, పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారని ఆమె తెలిపారు. తుపాను ఈ నెల 28న అర్ధరాత్రి కాకినాడ వద్ద తీరాన్ని దాటే అవకాశం ఉందని హోంమంత్రి వెల్లడించారు. దీని ప్రభావంతో రేపటి (27వ తేదీ) నుంచి రాష్ట్రంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, అలాగే గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ ముప్పును ఎదుర్కొనేందుకు ముందస్తు ఏర్పాట్లను పకడ్బందీగా చేపడుతున్నామని ఆమె అన్నారు.
Jharkhand: జార్ఖండ్‌లో దారుణం.. వైద్యుల నిర్లక్ష్యం.. 5 గురు పిల్లలకు హెచ్ఐవి పాజిటివ్.!
తుపాను ముందు, ఆ తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై అన్ని శాఖలతో సమీక్షలు నిర్వహించి సమన్వయంతో పనిచేయాలని ఆదేశాలు జారీ చేశామని మంత్రి తెలిపారు. ప్రజలకు ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని, అలాగే ఆస్తినష్టం సాధ్యమైనంత తక్కువగా జరిగేలా చూస్తున్నామని భరోసా ఇచ్చారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో అధికారులు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. హోర్డింగ్‌లను ముందుగా తొలగించాలని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని ఆదేశాలు జారీ చేశామని మంత్రి తెలిపారు. ముఖ్యంగా గట్లు బలహీనంగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు.
Donald Trump: మలేషియాలో డాన్స్ చేసిన యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ (వీడియో)
తుపాను సహాయక చర్యల కోసం ఇప్పటికే 6 జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం(NDRF), 13 రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం(SDRF) బృందాలను సిద్ధం చేశామన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ఈసారి సహాయక చర్యలను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. తుపాను ప్రభావం కోస్తా జిల్లాలన్నింటిపైనా ఉండే అవకాశం ఉందని, అయితే తుపాను తీరం దాటే ప్రాంతమైన కాకినాడ పరిధిలోని 6 మండలాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారని హోంమంత్రి అనిత చెప్పారు. అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి హెలికాప్టర్లు, హెలిప్యాడ్‌లు కూడా సిద్ధం చేసుకుంటున్నామని వెల్లడించారు. చివరగా సోషల్ మీడియాలో వచ్చే వదంతులు, పుకార్లను ప్రజలు నమ్మవద్దని ఆమె కోరారు. పుకార్లు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు.