‘మొంథా’ తుఫాన్ ప్రభావంతో ఏపీలోని అన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా జిల్లాలో తుఫాన్ బీభత్సం సృష్టించింది. తుఫాన్ బీభత్సంతో కృష్ణా జిల్లాలో నిలిచిన విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడానికి విద్యుత్ శాఖ అధికారులు వర్షంలో కూడా మరమ్మతులు చేపట్టారు. మచిలీపట్నం, పెడన, అవనిగడ్డ, గుడివాడ ప్రాంతాల్లో భారీగా మరమ్మత్తు పనులు చేపట్టారు. జిల్లాలో సుమారు 4 కోట్ల వరకు నష్టం వచ్చినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. వీలైనంత త్వరగా విద్యుత్ సరఫరా పునరుద్ధరణ చేస్తామని అధికారులు చెప్పారు.
మొంథా తుఫాన్ ప్రభావంతో పల్నాడు, గుంటూరు జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండడంతో ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. మాచర్ల, గురజాల, వినుకొండ, పెదకూరపాడు నియోజకవర్గాలలో వాగులు, చెరువులు పొంగి ప్రకారం వహిస్తున్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో నల్లమడ డ్రైన్, నక్కవాగు పొంగి ప్రవహించడంతో గుంటూరు-పర్చూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాహనాలు ఎక్కడికక్కడ నిలిపోయాయి.
విజయవాడ బస్టాండులో బస్సుల కోసం పడిగాపులు పడుతున్నారు ప్రయాణికులు. గమ్యస్ధానం నుంచీ బస్సు వస్తే తప్ప బస్సు ఉండదు అని అధికారులు చెపుతున్నారని ప్రయాణికులు అంటున్నారు. మరోవైపు ఇవాళ ఉదయం 11 గంటల నుంచీ అన్ని బస్ సర్వీసులు పునరుద్ధరించామని, బస్టాండులలో ఉండిపోయిన ప్రయాణికులకు సదుపాయాలు అందిస్తున్నామని చెపుతున్నారు అధికారులు.
Also Read: Montha Cyclone Live Updates: ‘మొంథా’ తుఫాన్ బీభత్సం.. లైవ్ అప్‌డేట్స్!
తుఫాను ప్రభావంతో పశ్చిమగోదావరి జిల్లాలోని మొగల్తూరు మండల ఆక్వా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. భారీ వర్షాలకు తోడు సముద్ర పోటు ఎక్కువ కావడంతో రొయ్యల చెరువులు ముంపు బారిన పడుతున్నాయి. దీంతో రైతులకు తీవ్ర నష్టాలు ఏర్పడుతున్నాయి. చేసేదిలేక ముందుగానే పట్టుబడులు సాగించి వచ్చిన కాడికి అమ్ముకునే ప్రయత్నాల్లో రైతులు నిమగ్నమయ్యారు.
మోంథా తుఫాన్ ప్రభావానికి విఎమ్ఆర్టిఏ (VMRDA)బిల్డింగ్ వెనక అభివృద్ధి కోసం వేసిన ఐరన్ పరంజి కుప్పకూలింది…మొంథా తుఫాన్ తీరం దాటిన దగ్గర నుండి ఈదురుగాలులు ప్రభావం ఎక్కువుగా ఉండటంతో ఇలాంటి సంఘటనలు నగర వ్యాప్తంగా చోటు చేసుకుంటాన్నాయి. ఈ ప్రమాద ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం లేకపోయిన పాక్షికంగా పలు వాహనాలు దెబ్బతిన్నాయి.