రాష్ట్రంలో రుషికొండ భవనాల వివాదం నడుస్తోంది. ఆ భవనాన్ని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పరిశీలించారు. అనంతరం ఆ భవాలకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియా, మీడియా ఛానెల్ లలో వైరల్ గా మారాయి. వాటిపై చాలా విమర్శలు వస్తున్నాయి. తాజాగా విశాఖ రుషికొండలో భవనాలపై వస్తున్న విమర్శలపై వైసీపీ స్పందించింది. తాజాగా సోషల్ మీడియా వేదిక ద్వారా వివరణ ఇచ్చింది. ‘అవి ప్రభుత్వ భవనాలే. ప్రైవేట్ ఆస్తులు కావు. విశాఖకు గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యంలో భాగంగానే వీటిని కట్టింది. విశాఖ ఆర్థిక రాజధాని అని చంద్రబాబు 1995 నుంచి ఊదరగొడుతున్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాన మంత్రి విశాఖకు వస్తే ఆతిథ్యం ఇవ్వడానికి సరైన భవనం లేదు. వీటి ఫొటోలను వైరల్ చేస్తూ బురదచల్లడం వెనుక ఉద్దేశమేంటో ప్రజలకు తెలుసు’ పేర్కొంది.
READ MORE: Amit Shah: త్వరలో.. జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్..!
కాగా.. రిషికొండపై గత ప్రభుత్వం నిర్మించిన భవనాలను ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖ రిషికొండపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం అడ్డగోలుగా అక్రమ కట్టడాలను కట్టిందని విమర్శించారు. కూటమి శ్రేణులతో కలిసి నిర్మాణాలను పరిశీలించిన ఆయన ఎన్జీటీ ఆదేశాలను సైతం పక్కన పెట్టారని ఆరోపించారు. ప్రజాధనంతో జగన్ కట్టిన భవనాలు ఎందుకు ఉపయోగపడతాయో కూడా తెలియడం లేదని విమర్శించారు. వైఎస్సార్సీపీ నేతల అక్రమాలతో పాటు భూ దోపిడీపై విచారణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలోనే కూటమి ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. 500 కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారన్నారు.