కూటమి ప్రభుత్వ పాలనపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల్లో వాగ్దానం చేసిన ‘సూపర్ సిక్స్’ పథకాలు అమలు కావటం లేదని మండిపడ్డారు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, నిరుద్యోగ భృతి ఇవ్వలేదన్నారు. విజన్ డాక్యుమెంటరీపై చర్చలు జరపాలని తాను సీఎం చంద్రబాబు నాయుడుకి సవాల్ విసురుతున్నా అని అన్నారు. సినిమాకి పెట్టుబడి పెట్టి టికెట్లు అమ్ముకుంటున్నారని, రైతులు ఎండ వాన చూడకుండా పెట్టుబడి పెట్టి పంట పండిస్తే కనీస మద్దతు ధర ఇవ్వరు అని రామకృష్ణ ధ్వజమెత్తారు. వేరే రాష్ట్రాల్లో లేని సినిమా రేట్లు మన రాష్ట్రానికి ఎందుకు అని ప్రశ్నించారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ… ‘ ఎన్నికల్లో వాగ్దానం చేసిన సూపర్ సిక్స్ పథకాలు అమలు కావటం లేదు. రైతులకు హామీ నెరవేర్చలేదు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. మహిళలకు అమ్మ ఒడి, విద్యార్థులకు విద్యాధీవన ఇవ్వలేదు. మహిళలకు నెలకు రూ.1500 ఇస్తానని ఇవ్వలేదు. సీఎం చంద్రబాబుకి సవాల్ చేస్తున్నా.. మీ విజన్ డాక్యుమెంటరీపై చర్చలు జరపాలి. అన్ని పార్టీలతో చర్చలు జరపాలి, చర్చలకు మేము రెడీ. హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర తల్లి చనిపోయి, బాబు హాస్పిటల్లో చావుబతుకుల మధ్యలో ఉంటే వారితో ఎందుకు మాట్లాడరు?’ అని ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ఆలోచించాలి. టిక్కెట్ ధర ఎందుకు పెంచాలి, అది వారి వ్యాపారం కాబట్టి. సినిమాకి పెట్టుబడి పెట్టి టికెట్లు అమ్ముకుంటున్నారు. రైతులు ఎండ వాన చూడకుండా పెట్టుబడి పెట్టి పంట పండిస్తే కనీస మద్దతు ధర ఇవ్వరు. సినిమా వాళ్లకు కోట్లు కోట్లు లాభం వచ్చేలా చేస్తారు కానీ.. రైతును మాత్రం పట్టించుకోరు. 100 కోట్లు 200 కోట్లు పెట్టి సినిమా తీస్తుంటే.. వాళ్ళకి ప్రభుత్వం ఊడిగం చేస్తోంది. దీనిని పూర్తిగా ఖండిస్తున్నాం. వేరే రాష్ట్రాల్లో లేని సినిమా రేట్లు మన రాష్ట్రానికి ఎందుకు. వెయ్యి రూపాయలా?.. ఇష్టానుసారంగా టికెట్లు రేట్లు పెంచారు. సినిమా వారికి ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు దోచిపెడుతున్నారు. దీనిని మేం ఖండిస్తున్నాము’ అని రామకృష్ణ పేర్కొన్నారు.