Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబుపై కేసుల విషయంలో ఈ రోజు కీలక తీర్పులు రానున్నాయి. చంద్రబాబుకు ముందస్తు బెయిల్ వస్తుందా? లేదా అన్న ఉత్కంఠకు తెరపడనుంది. చంద్రబాబుపై కేసు కొట్టివెయ్యాలంటూ సుప్రీం కోర్టులో ఆయన తరపు లాయర్లు క్వాష్ పిటిషన్ వేశారు. దీనిపై అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వనుంది. చంద్రబాబు కేసు సుప్రీంలో 59 వ ఐటెమ్ గా లిస్ట్ అయింది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా.ఎమ్.త్రివేది లతో కూడిన ధర్మాసనం ముందు వాదనలు జరగనున్నాయి. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే, అభిషేక్ మను సింఘ్వి, సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించనున్నారు. ఏపీ ప్రభుత్వం తరఫున ముకుల్ రోత్గి వాదనలు వినిపిస్తారు.
గత వారం ద్విసభ్య ధర్మాసనం ముందు వాదనలు సందర్బంగా, హైకోర్టుకు సమర్పించిన పత్రాలను సుప్రీంకోర్టు ధర్మాసనానికి కూడా సమర్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది న్యాయస్థానం.. ఇక ముందస్తు అనుమతి లేకుండా అరెస్ట్ చేయడం అసంబద్ధమని చంద్రబాబు వాదించారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ ప్రకారం తన అరెస్ట్ కు గవర్నర్ అనుమతి తప్పనిసరి అని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తనపై నమోదైన ఎఫ్ఏఆర్ ను కొట్టివేయాలని, జ్యుడీషియల్ రిమాండ్ ను రద్దు చేయాలని చంద్రబాబు కోరారు. దీనిపై సుప్రీం కోర్టు ఇవాళ తీర్పు ఇవ్వబోతోంది.
మరోవైపు.. విజయవాడ ఏసీబీ కోర్టు కూడా బెయిల్ పిటిషన్ పై తీర్పు చెప్పనుంది. అలాగే సీఐడీ కస్టడీ పిటిషన్ పై కూడా ఏసీబీ కోర్టు నిర్ణయం ప్రకటించనుంది. చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో మూడురోజులపాటు సుధీర్ఘంగా వాదనలు జరిగాయి. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ దూబే, సీఐడీ తరఫున ఏఏజీ సుధాకర్ రెడ్డి వాడివేడిగా వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తీర్పు రిజర్వ్ చేశారు. బెయిల్ , సీఐడీ కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టు ఇవాళ తీర్పు ఇవ్వనుంది.
ఇక, అంగళ్లు కేసులో ముందస్తు బెయిల్ పై తీర్పు చెప్పబోతోంది హైకోర్టు. ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్‌నెట్ కేసుల్లోనూ చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించనుంది.దీంతో అందరి చూపులు కోర్టులవైపే ఉన్నాయి.చంద్రబాబుకు బెయిల్ వస్తుందా,లేదా అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.