Rahul Gandhi: ఢిల్లీలోని రాహుల్‌గాంధీ నివాసానికి ఆదివారం ఢిల్లీ పోలీసులు వెళ్లారు. ‘భారత్ జోడో యాత్ర’ సందర్భంగా రాహుల్ గాంధీ చేసిన “మహిళలు ఇప్పటికీ లైంగిక వేధింపులకు గురవుతున్నారు” అనే వ్యాఖ్యకు సంబంధించి ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు ఈరోజు ఆయన నివాసానికి చేరుకున్నారు. లైంగిక వేధింపులకు సంబంధించి తనను సంప్రదించిన మహిళల వివరాలను కోరుతూ పోలీసులు మార్చి 16న కాంగ్రెస్ నాయకుడికి నోటీసు జారీ చేశారు. సోషల్ మీడియా పోస్ట్‌లను పరిగణనలోకి తీసుకున్న పోలీసులు రాహుల్ గాంధీకి ప్రశ్నావళిని పంపారు. దీనిపై రాహుల్ గాంధీ ఇంకా స్పందించలేదు.
భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ శ్రీనగర్‌లో ‘మహిళలపై లైంగిక వేధింపులకు గురవుతున్నట్లు నేను విన్నాను’ అని వాంగ్మూలం ఇచ్చారని పోలీసులు తెలిపారు. రాహుల్ గాంధీ అధికారిక సామాజిక మాధ్యమాల ఖాతాలో పెట్టిన పోస్ట్‌ల ఆధారంగా ఈ కేసును నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ పోలీసు బృందానికి ఢిల్లీ పోలీసు శాంతిభద్రతల విభాగం ప్రత్యేక పోలీస్ కమిషనర్ సాగర్ ప్రీత్ హుడా నాయకత్వం వహించారు. రాహుల్ గాంధీ నివాసం బయట సాగర్ ప్రీత్ హుడా మీడియాతో మాట్లాడారు. భారత్ జోడో యాత్రలో తనను ఇద్దరు మహిళలు కలిశారని, తమపై అత్యాచారాలు జరిగాయని చెప్పారని రాహుల్ గాంధీ జనవరి 30న కశ్మీరులో జరిగిన సభలో చెప్పారని హుడా తెలిపారు. ఆ బాధిత మహిళలకు న్యాయం జరిగేలా చేయడం కోసం వారి వివరాలను తమకు ఇవ్వాలని ఆయనను కోరేందుకు వచ్చామని చెప్పారు. ఈ అంశంపై సమాచారాన్ని సేకరించేందుకు మార్చి 15న ప్రయత్నించామని, అప్పుడు విఫలమయ్యామని చెప్పారు. మార్చి 16న ఆయనకు నోటీసు పంపించామని తెలిపారు.
Read Also: Harassment : చదువేమో పీహెచ్డీ గ్రాడ్యుయేట్.. చేసేది చిన్నారుల లైంగిక వేధింపులు
ఢిల్లీ పోలీసులు ఆ మహిళల వివరాలను రాహుల్ గాంధీ నుంచి తెలుసుకోవాలని, తద్వారా చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. సంబంధిత మహిళలకు సంబంధించిన సమాచారాన్ని పొందేందుకు గాంధీతో మాట్లాడేందుకు ప్రత్యేక పోలీసు కమీషనర్ స్థాయి అధికారితో పాటు ఉన్నత పోలీసు అధికారులు ప్రయత్నిస్తున్నారు. రాహుల్‌గాంధీ వివరాలు ఇవ్వకపోతే, అతనికి మరో నోటీసు ఇవ్వబడుతుంది అని ఢిల్లీ పోలీసు వర్గాలు చెబుతున్నాయి.