మొయినాబాద్లో కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి జి. రంజిత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీని గెలిపిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల రిజర్వేషన్లు పోతాయి.. కాంగ్రెస్ వస్తే బీసీగణన పథకాలు వస్తాయని తెలిపారు. ఇదే విషయాన్ని మొన్నటి సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడగానే.. బీజేపీ నేతలకు గుబులు పట్టుకుందని అన్నారు. అందుకే ఇప్పుడు మాట మార్చి ఏదేదో మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.
Read Also: Maria Feliciana: ప్రపంచ పొడవైన మహిళ కన్నుమూత..
గత ఐదేళ్ళలో తన ఇంటికి వచ్చిన ప్రతీ ఒక్కరినీ ఆదరించానన్నారు. ప్రతీ ఒక్కరి కష్టం తెలుసుకుని, తీర్చటానికి ప్రయత్నించానని తెలిపారు. ఐదేళ్ల నుంచి జనాన్ని పట్టించుకోని బీజేపీ అభ్యర్థి.. ఇప్పుడొచ్చి అందరికీ అపాయింట్మెంట్ ఇస్తా, అందరినీ కలుస్తా అంటే ఎవరు నమ్ముతారని ఆరోపించారు. చేవెళ్ల లోక్సభ పరిధిలో అందరికీ ఆరు గ్యారెంటీలను అమలు చేయించే బాధ్యత తనదని రంజిత్ రెడ్డి తెలిపారు. అర్హులైన ప్రతీ ఒక్కరికీ రూ.500కే గ్యాస్ సిలిండరు వస్తుంది.. అర్హులైన వారందరకీ 200 యూనిట్ల లోపు ఉచిత కరెంటు స్కీమ్ వర్తిస్తుందని చెప్పారు.
Read Also: Khalistan: కెనడా పీఎం ట్రూడో సమక్షంలో ఖలిస్తాన్ అనుకూల నినాదాలు..
లోక్సభ ఎన్నికలు అయిపోయాక తాము ఎక్కడికీ పోమని.. ఈ గడ్డ మీదనే ఉంటామన్నారు. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కోసం మళ్లీ మీ దగ్గరకే వస్తామని రంజిత్ రెడ్డి తెలిపారు. మీలో ఎవరికైనా ఆరు గ్యారంటీలు అమలుకాకపోతే అప్పుడు అడగండి అని అన్నారు. ఆగస్టు 15లోపు రైతు రుణమాఫీ చేసి తీరతామని రంజిత్ రెడ్డి పేర్కొన్నారు.