Khalistan: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తన భారత వ్యతిరేక వైఖరిని అవలంభిస్తూనే ఉన్నాడు. తాజాగా టొరంటోలో జరిగి ఖల్సా డే సెలబ్రేషన్స్‌లో పీఎం ట్రూడో, ప్రతిపక్ష నేత పియరీ పోయిలీవ్రే సమక్షంలో ఖలిస్తాన్ అనుకూల నినాదాలు చేయడం చర్చనీయాంశంగా మారాయి. కెనడాలో ఇటీవల కాలంలో భారత వ్యతిరేక సెంటిమెంట్లు పెరుగుతున్నాయి. ముఖ్యంగా అక్కడ కొందరు రాడికల్ సిక్కులు ఖలిస్తాన్ డిమాండ్ చేస్తున్నారు. దీనికి మద్దతుగా ట్రూడో ప్రభుత్వం, అతని పార్టీ వ్యవహరిస్తోంది.
ట్రూడోతో అధికారాన్ని పంచుకుంటున్న ఖలిస్తాన్ అనుకూల పార్టీ ఎన్డీపీ నేత జగ్మీత్ సింగ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరైన సందర్భంలో ‘‘ఖలిస్తాన్ జిందాబాద్’’ నినాదాలు వినిపించాయి. ప్రతిపక్ష నాయకుడు పియరీ ప్రోయిలీవ్రే కార్యక్రమంలో మాట్లాడేందుకు వెళ్లిన సమయంలో కూడా ఇలాంటి నినాదాలే వినిపించాయి. టొరంటోలో జరిగిన ఈ కార్యక్రమానికి వేలాది మంది ప్రజలు హాజరయ్యారు. సిక్కు కొత్త సంవత్సర వైశాఖని ఖల్సాడే అని కూడా పిలుస్తారు.
Read Also: Attack On BJP: బీజేపీ కార్యకర్తపై దాడి.. ఆ పార్టీ చెందిన పలువురు వ్యక్తులపై ఆరోపణ..
ఇక ప్రధాని జస్టిన్ ట్రూడో సిక్కు కమ్యూనిటీని ఉద్దేశించి మాట్లాడే సమయంలో ప్రజల నుంచి పెద్ద ఎత్తున నినాదాలు వచ్చాయి. దేశంలోని సిక్కు కమ్యూనిటీ హక్కులు, స్వేచ్ఛలను అన్ని విధాలుగా రక్షించేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందని ఆయన చెప్పారు. కెనడాలో దాదాపుగా 8 లక్షల మంది సిక్కులు ఉన్నారు. ద్వేషం, వివక్షకు వ్యతిరేకంగా మీ కమ్యూనిటీని రక్షించుకుంటామని చెప్పారు.
భారత్-కెనడాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో ట్రూడో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. గతేడాది హర్దీప్ సింగ్ నిజ్జర్ అనే ఖలిస్తానీ ఉగ్రవాదిని కెనడాలోని సర్రే ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. అయితే, ఈ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని ప్రధాని ట్రూడో ఆరోపించాడు. అయితే, ఆయన చేసిన వ్యాఖ్యలు అసంబద్ధమైన, ప్రేరేపిత వ్యాఖ్యలుగా ఇండియా కొట్టిపారేసింది. కెనడా గడ్డ గ్యాంగ్‌స్టర్లు, ఉగ్రవాదులకు నిలయంగా మారిందని భారత్ ఆరోపించింది. దీంతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు క్షీణించాయి.