Karnataka: కాంగ్రెస్ ఎమ్మెల్యే డి.సుధాకర్‌కు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆయన మద్దతుదారులు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నివాసం ఎదుట బుధవారం నిరసన చేపట్టారు. సిద్ధరామయ్య, డీకే శివకుమార్, డి.సుధాకర్ పోస్టర్లతో ఆందోళనకు దిగిన కార్యకర్తలు సుధాకర్‌కు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. అక్కడికక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నప్పటికీ వారు నినాదాలు చేశారు.
సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవలే కొలువుదీరింది. మొత్తం 34 మంత్రి పదవులకు గాను 10 మంది ప్రమాణ స్వీకారం చేశారు. మరో 24 మంత్రి పదవులను కేటాయించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సుధాకర్‌కు మంత్రి పదవి కేటాయించాలంటూ ఆయన మద్దతుదారులు ఆందోళనకు దిగడం కలకలం రేపింది. మే 10న జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 224 స్థానాలకు గాను 135 స్థానాలను కైవసం చేసుకుని, బీజేపీని అధికారం నుంచి దింపిన కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. బీజేపీ 66 సీట్లతో రెండో స్థానంలో నిలవగా, కింగ్‌మేకర్‌గా అవతరించాలని భావించిన జేడీ(ఎస్) 19 సీట్లకు తగ్గింది.