NTV Telugu Site icon

PM Modi: కాంగ్రెస్ ప్రజల కన్నా తన ఓటు బ్యాంకునే ఎక్కువగా ప్రేమిస్తుంది..

Pm Modi

Pm Modi

PM Modi: కాంగ్రెస్ టార్గెట్‌గా మరోసారి ప్రధాని నరేంద్రమోడీ విరుచుకుపడ్డారు. రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో మోడీ పర్యటించారు. ‘పేపర్ లీక్ మాఫియా’ రాజస్థాన్ లోని లక్షలాది మంది యువత భవిష్యత్తును నాశనం చేసిందని సీఎం అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. జోధ్‌పూర్ లో జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ చేసిన ప్రతీ అవినీతి తమ వద్ద ఉందని, దానిని బయటకు తీసుకురావాలంటే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలని మోడీ అన్నారు.

రాజస్థాన్ క్యాబినెట్ నుంచి తొలిగించబడిని మంత్రి రాజేంద్ర గుడా గతంలో ముఖ్యమంత్రి ఆర్థిక లావాదేవీలు రెడ్ డైరీలో నమోదయ్యాయని ఆరోపించడాన్ని మోడీ ప్రస్తావించారు. రైతులు, సైనికులను కాంగ్రెస్ పట్టించుకోవడం లేదని, వారికి కుర్చీ తప్ప మరేది కనిపించదని, ప్రజల ప్రయోజనాల కంటే కాంగ్రెస్ తన ఓటు బ్యాంకునను ఎక్కువగా ప్రేమిస్తోందని ఆయన ఆరోపించారు.

Read Also: Putin: ప్రధాని మోడీ చాలా తెలివైన వ్యక్తి.. రష్యా అధ్యక్షుడి ప్రశంసలు..

జోధ్‌పూర్ లో రూ. 5000 కోట్ల ప్రాజెక్టులను ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సీఎం అశోక్ గెహ్లాట్ గైర్హాజరయ్యారు. దీనిపై మోడీ విమర్శలు ఎక్కుపెట్టారు. మోడీ వస్తే అంతా బాగానే ఉంటుందని కాంగ్రెస్ లీడర్లు అనుకుంటారని ఎద్దేవా చేశారు. అంతా మేం చూసుకుంటాం, మీరు రెస్ట్ తీసుకోండని గెహ్లాట్ కి చురకలు అంటించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల గురించి మాట్లాడుతూ.. మహిళలు, దళితులపై అత్యాచారాలను ప్రస్తావించారు.

ఈ ఏడాది చివర్లో రాజస్థాన్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. రాజస్థాన్ తో పాటు తెలంగాణ, మిజోరాం, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రాల ఎన్నికలు ఇటు బీజేపీకి, అటు కాంగ్రెస్ పార్టీకి కీలకంగా మారాయి. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉండగా.. మధ్యప్రదేశ్ లో బీజేపీ అధికారంలో ఉంది.