Rajastan: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచేందుకు నామినేషన్ వేయడానికి ముందే రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తన పదవికి రాజీనామా చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. జైపూర్‌లోని అశోక్ గెహ్లాట్ నివాసం ఇవాళ రాత్రి 7గంటలకు కాంగ్రెస్ శాసనసభాపక్షం భేటీ కానుంది. గెహ్లాట్ పదవికి రాజీనామా చేస్తే తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే దానిపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. పార్టీ సీనియర్ నేతలు అజయ్ మాకెన్, మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో ఈ సమావేశం జరగనుంది. ఈ భేటీకి ఎమ్మెల్యేలంతా తప్పనిసరిగా హాజరవ్వాలని ఇప్పటికే సమాచారం అందించారు. గత మంగళవారమే సీఎల్పీ సమావేశం జరిగింది. వారం రోజుల వ్యవధిలోనే రెండోసారి భేటీ జరుగుతుండటం ప్రాధాన్యత సంతరించుకున్నది.
రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి మార్పు తథ్యమన్న వార్తల నేపథ్యంలో సీనియర్ నేత సచిన్ పైలట్ అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషితో సమావేశమయ్యారు. ఇప్పటికే ఆయన ఎమ్మెల్యేల మద్దతును కూడగట్టుకున్నారు. బీఎస్పీ నుంచి కాంగ్రెస్‌లో విలీనమైన ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా సచిన్ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై సానుకూలంగా ఉన్నారు. గెహ్లాట్ పార్టీ అధ్యక్షుడిగా వెళ్లినపక్షంలో.. సచిన్ ముఖ్యమంత్రి అయితే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని మంత్రి రాజేంద్ర గుధా స్పష్టం చేశారు.
ఇవాళ జరిగే కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ కీలక భేటీలో రాజస్థాన్ కాంగ్రెస్ శాసనసభాపక్షానికి కొత్త సారథిని నిర్ణయించే అధికారం అధ్యక్షురాలు సోనియా గాంధీకే వదిలేస్తూ ఈ సమావేశంలో తీర్మానం చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే సచిన్ పైలట్‌ను నూతన సీఎం చేయడం గహ్లోత్‌కు ఇష్టం లేదు. ఈ విషయంపై ఎమ్మెల్యేలు కూడా మాట్లాడాలని ఆయన కోరుతున్నట్లు తెలుస్తోంది.మరోవైపు సచిన్ పైలట్‌కు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నుంచి హామీ వచ్చిందని, ఆయనే తదుపరి ముఖ్యమంత్రి అని పార్టీ వర్గాలు చెప్పాయి. అంతేగాక తాను నామినేషన్ సమర్పించిన తర్వాతే రాజస్థాన్ కొత్త సీఎంపై నిర్ణయం తీసుకోవాలని సూచించినట్లు పేర్కొన్నాయి.
PM Narendra Modi: చండీగఢ్ ఎయిర్‌పోర్టు పేరు భగత్ సింగ్‌గా మార్పు.. ప్రకటించిన పీఎం మోదీ
జైపూర్‌లో జరిగే ఈ సమావేశానికి పరిశీలకుడిగా కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే, రాజస్థాన్ ఇన్‌ఛార్జ్‌గా అజయ్ మాకెన్ హాజరుకానున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఖర్గేను పరిశీలకుడిగా సోనియా గాంధీ నియమించారు. అక్టోబర్ 17న జరగనున్న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ సెప్టెంబర్ 24న మొదలై 30వరకు కొనసాగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 8 వరకు గడువుంది. ఎన్నికలు జరిగిన రెండో రోజు అంటే అక్టోబర్ 19న ఫలితాలు ప్రకటిస్తారు.