Jaggareddy: సంగారెడ్డిలో ఓటమిపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి స్పందించారు. సంగారెడ్డి ప్రజల తీర్పును స్వాగతిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. సంగారెడ్డి ప్రజలు తనకు 5 ఏళ్లు విశ్రాంతి ఇచ్చారని.. తనకు ఓట్లు వేసిన 65 వేల మందికి.. అలాగే తనకు ఓట్లు వేయని 71వేల మందికి జగ్గారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. సంగారెడ్డి ప్రజలు తనకు కౌన్సిలర్‌గా, మున్సిపల్ ఛైర్మన్‌గా అవకాశం ఇచ్చారన్నారు. అలాగే 2004, 2009లో ఎమ్మెల్యేగా గెలిపించి అవకాశం ఇచ్చారని జగ్గారెడ్డి చెప్పారు. 2014లో ఓడించారు మళ్ళీ 2018లో ఎమ్మెల్యే గా గెలిపించారు కానీ ప్రభుత్వం రాలేదన్నారు.
2023 అంటే ఇప్పుడు మళ్ళీ నన్ను ఓడించారని.. మీ తీర్పుని గౌరవిస్తున్నా, స్వాగతిస్తున్నామని ఆయన అన్నారు. మీకు 24 గంటల్లో అందుబాటులో ఉండే వారిని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారని.. ఆ ఎమ్మెల్యేతో పని చేయించుకోండి అంటూ ఆయన వ్యాఖ్యానించారు. తాను హైదరాబాద్‌లో ఉండి కాంగ్రెస్ పార్టీ పథకాలు అమలు అయ్యేలా చూస్తా.. అధికారులతో ఎప్పటికప్పుడు టచ్‌లోనే ఉంటానంటూ జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. అలాగే మీకు 24గంటలు ఫోన్‌లో ఏ సమయానికి ఫోన్ చేసిన అందుబాటులో ఉండే మాజీ మంత్రి హరీష్ రావు, ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేతో పనులు చేయించుకోవాలన్నారు. తాను అందుబాటులో లేను అనే కదా నన్ను విమర్శించారంటూ జగ్గారెడ్డి అన్నారు. ఇప్పుడు అందుబాటులో ఉన్నవారు గెలిచారు పనులు చేయించుకోవాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని.. తనను గెలిపించుకోవాలని సంగారెడ్డి ప్రజలకు ముందుగానే చెప్పానన్నారు. ఈ 9 ఏళ్లలో బీఆర్ఎస్ చేయని అభివృద్ధి, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని చెప్పానని.. కానీ ప్రజలు మరి ఎందుకు బీఆర్ఎస్‌కి కనెక్ట్ అయ్యారో తెలీదన్నారు.
Read Also: Congress: రేపే కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం!
జగ్గారెడ్డి మాట్లాడుతూ..”నేను ఓడిపోయినా కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ చెప్పిన 6 గ్యారెంటీ స్కీంలు సంగారెడ్డిలో ప్రజలకు అమలు అవుతాయి. నా ఓటమికి పథకాలకు లింక్ ఏమి ఉండదు.. అన్ని పథకాలు అందరికి వస్తాయి. ఇక మిగతా పనులు మీకు అందుబాటులో ఉన్న వారితో చేయించుకోండి. లేదా ప్రతి ఒక్క పనికిమాలినోడు అందుబాటులో లేడని అంటారు. ఇక అందుబాటులో ఉండే నాయకుడితో పని చేయించుకోండి. రాష్ట్రంలో మెజారిటీతో కాంగ్రెస్‌కి అధికారం ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నా కార్యకర్తలు, ముఖ్యనాయకులు, ప్రజాప్రతినిధులు, ఫాలోవర్లు ఎవరు నిరాశపడొద్దు.. ధైర్యంగా ఉండాలి. మీరందరు చాలా కష్టపడి పని చేశారు.. 2014లో ఓడిపోయినా, 2018లో గెలిచినా ప్రభుత్వం లో లేకపోయినా ఆర్థికంగా ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా, నేను ఇచ్చినా ఇవ్వకపోయినా చాలా కష్టపడ్డారు. నా రాజకీయం గురించి ఇప్పుడే చెప్పను. ఇంకో 4 ఏళ్ల తర్వాత చెప్తాను.” అని జగ్గారెడ్డి అన్నారు.