Congress: రాహుల్ గాంధీని పాకిస్తాన్ మాజీ మంత్రి ఫవాద్ హుస్సేన్ ప్రశంసించడం కాంగ్రెస్, బీజేపీల మధ్య తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ‘‘రాహుల్ గాంధీ అన్ ఫైర్’’ అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేయడంపై వివాదం మొదలైంది. కాంగ్రెస్ అంటే పాకిస్తాన్‌కి ఇష్టమని బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదిలా ఉంటే దీనిపై కాంగ్రెస్ నేత రషీద్ అల్వీ బీజేపీపై ఎదురుదాడికి దిగారు. పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, అతని సోదరుడు ప్రస్తుత ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఒత్తిడి మేరకు అతను ఈ వ్యాఖ్యలు చేశాడని, నవాజ్ షరీఫ్‌కి ప్రధాని మోడీతో మంచి సంబంధాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు.
ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఇలాంటి వ్యాఖ్యల వల్ల ప్రయోజనం పొందొచ్చని అల్వీ అన్నారు. పాకిస్థాన్‌లో ఇమ్రాన్ ఖాన్ క్యాబినెట్‌లో మాజీ మంత్రి హుస్సేన్ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో రాహుల్ గాంధీని వీడియోను షేర్ చేసి ప్రశంసలు కురిపించాడు. దీనిపై కాంగ్రెస్ నేత రషీద్ అల్వీ మాట్లాడుతూ.. ‘‘అతను (ఇమ్రాన్ ఖాన్) జైలులో ఉన్నాడు. నవాజ్ షరీఫ్ మరియు అతని సోదరుడి ప్రభుత్వం నుండి ఒత్తిడి చేయడం వల్ల ఫవాద్ చౌదరి ప్రకటన చేశారు. నవాజ్ షరీఫ్‌తో పీఎం మోడీకి మంచి సంబంధాలు ఉన్నాయి. బీజేపీకి పాకిస్తాన్‌తో సంబంధాలు ఉన్నాయి. మన్మోహన్ సింగ్, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఎప్పుడూ పాకిస్తాన్ వెళ్లలేదు. ఫవాద్ హుస్సేన్ ప్రకటన నుంచి ప్రయోజనం పొందాలనుకునే వారు అతడిపై ఒత్తిడి తెచ్చారు.’’ అన్నారు.
రాహుల్ గాంధీ రామమందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమం ఆహ్వానితులను ఉద్దేశిస్తూ బీజేపీపై విమర్శలు చేశారు. ఈ వీడియోను పాక్ మాజీ మంత్రి షేర్ చేశారు. అయితే, దీనిపై ప్రధానిమోడీ స్పందించారు. ‘‘భారత్‌లో కాంగ్రెస్ బలహీనపడుతోంది. తమాషా ఏంటంటే, కాంగ్రెస్ చచ్చిపోతుంటే పాకిస్తాన్ ఏడుస్తోంది, ఇప్పుడు పాక్ నేతలు కాంగ్రెస్ కోసం ప్రార్థిస్తున్నారు’’ అని అన్నారు. పాకిస్తాన్ యువరాజు(రాహుల్ గాంధీ)ని ప్రధాని చేయడం కోసం ఉత్సాహంగా ఉంది. కాంగ్రెస్ పాకిస్తాన్‌కి అభిమాని అని మాకు తెలుసని, పాకిస్తాన్, కాంగ్రెస్ మధ్య ఈ భాగస్వామ్యం బహిర్గతమైందని ప్రధాని ఆరోపించారు.