తెలంగాణలో రాజకీయం ప్రస్తుతం మునుగోడు వైపు చూస్తోంది. మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నిక రాబోతున్న వేళ.. ఆయా పార్టీల నేతలు ఉప ఎన్నికలో గెలిచేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకరిపై ఒకరి విమర్శలు గుపిస్తూ ప్రసంగాలు ఇస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే.. మునుగోడు లో కాంగ్రెస్ పార్టీ వినూత్న కార్యక్రమాలు చేపట్టింది. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలపై నిరసనగా భారీ గ్యాస్ సిలిండర్ బెలూన్ల ఏర్పాటు చేసింది కాంగ్రెస్. మునుగోడు లో ప్రజల సమస్యలపై నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన వినూత్న బ్యానర్లను పోలీసులు నిరంకుశంగా తొలగించారు. పెరిగిన గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన భారీ గ్యాస్ సిలిండర్ బెలూన్లను పోలీసులు తొలగించారు. “కాంగ్రెస్ హయాంలో నా ధర రూ.410.. బీజేపీ హయాంలో ఇప్పుడు నా ధర రూ. 1105.. నన్ను కొనే దమ్ముందా… వంట చేసేంత సీన్ ఉందా” అంటూ ఏర్పాటు చేసిన భారీ గ్యాస్ సిలిండర్ బెలూన్లు అందరినీ ఆకర్షిస్తున్నాయి.
గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా పెంచిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటాన్ని టీఆర్ఎస్ అణచివేయడం చూస్తుంటే, టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ మధ్య ఉన్న చీకటి స్నేహం మరోసారి బయట పడిందని మునుగోడు ప్రజలు చర్చించుకుంటున్నారు. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా, టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ మొత్తం బీజేపీకి వ్యతిరేకంగా బ్యానర్లు ఏర్పాటు చేసినా, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన భారీ గ్యాస్ సిలిండర్ బెలూన్లను తొలగించడం, పోలీసుల పక్షపాత వైఖరికి నిదర్శనంగా మారిందని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.