Site icon NTV Telugu

NVSS Prabhakar : కాంగ్రెస్-బీఆర్‌ఎస్ మధ్య రాజకీయ డీల్‌..? ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ సంచలన ఆరోపణలు

Nvss Prabhakar

Nvss Prabhakar

NVSS Prabhakar : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కలకలం రేపే వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్. కాంగ్రెస్ , బీఆర్ఎస్ మధ్య ఓ రహస్య రాజకీయ డీల్ కుదిరిందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో బీఆర్‌ఎస్ విలీనానికి గ్రౌండ్‌ వర్క్‌ మొదలైపోయిందని, ఇప్పటికే రెండుపార్టీల కీలక నేతల మధ్య రాజీ కుదిరిందని అన్నారు. ఈ డీల్‌లో భాగంగానే కాలేశ్వరం అవినీతి, విద్యుత్ కొనుగోళ్ల స్కామ్, ఫోన్ ట్యాపింగ్ వంటి కీలక అంశాలపై ఎలాంటి విచారణ జరగకుండా నీరుగారిపోయేలా చూస్తున్నారని ఆరోపించారు. “తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వేల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్టు పూర్తయ్యే సమయానికి తుడిచిపెట్టుకుపోయింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎవరు బాధ్యులు అనే విషయం ఇప్పటికీ తేల్చలేకపోవడమే ఇందుకు నిదర్శనం,” అని చెప్పారు.

AP High Court: వల్లభనేని వంశీ పిటిషన్‌పై విచారణ వచ్చే వారానికి వాయిదా..

అలాగే, విచారణ పేరుతో కాలయాపన చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ కొనుగోళ్ల అంశంలోనూ అదే తతంగం కొనసాగుతోందని, అసలు దోషులను ఇప్పటివరకు గుర్తించలేకపోయారని విమర్శించారు. ప్రభాకర్ తెలంగాణలో పరిపాలన పూర్తిగా స్థంభించిపోయిందని, రైతాంగ సమస్యలపై ప్రభుత్వానికి ఎలాంటి శ్రద్ధ లేదని అన్నారు. ధాన్యం సేకరణను దళారులకు వదిలేసిన ప్రభుత్వ వ్యవస్థ వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, దీనిపై కేంద్ర వ్యవసాయ మంత్రిని కలసి పిర్యాదు చేస్తామన్నారు.

ముఖ్యమంత్రి, మంత్రులపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసిన ప్రభాకర్… “ఇవాళ భూములు అమ్మే ప్రభుత్వంగా మారిపోయారు. ప్రజలకు సేవ చేయాల్సిన నాయకులు బీర్లు అమ్మే తతంగంలో పడిపోయారు” అంటూ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రానికి కేంద్రం మంజూరు చేసిన పథకాల అమలులోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఫెడరల్ స్ఫూర్తిని తూలనిచ్చిందని అన్నారు. కేంద్ర ప్రాజెక్టుల అమలుకు రాష్ట్ర వాటాను ఇవ్వకుండా ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని, నిధుల మళ్లింపుపై కేంద్ర ఆర్థిక మంత్రిని కలసి పిర్యాదు చేస్తామని తెలిపారు.

Raashi Khanna : షూటింగ్‌‌లో గాయపడ్డ హీరోయిన్..

Exit mobile version