కరోనా కారణంగా వర్క్‌ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పించిన ఐటీ కంపెనీలు…. నెమ్మదిగా వారందరినీ కార్యాలయాలకు రప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. విడతల వారీగా తమ ఉద్యోగులు కార్యాలయాలకు రావాలని సూచిస్తున్నాయి. ఐటీ ఉద్యోగులు, కుటుంబసభ్యులకు నూరు శాతం వ్యాక్సినేషన్ త్వరలో ముగియనుండడంతో.. వెనక్కు రప్పించే కసరత్తు ముమ్మరం చేశాయి. కొన్ని దేశీయ పెద్ద కంపెనీలు, చిన్న, మధ్యతరహా ఐటీ సంస్థలు దసరా నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించనున్నాయి. ఈ ఏడాది చివరికల్లా కనీసం 50శాతం ఉద్యోగులు కార్యాలయాల్లో పనిచేసేలా ఏర్పాట్లు చేస్తున్నాయి. మరోవైపు విదేశీ ఐటీ కంపెనీలు హైదరాబాద్‌లోని తమ ఉద్యోగులు జనవరి నాటికి కార్యాలయాలకు వచ్చేందుకు సిద్ధం కావాలని ఇప్పటికే ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందిస్తున్నాయి.