Jagananna Amma Vodi: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విద్యార్థుల తల్లిదండ్రులకు శుభవార్త చెప్పారు.. ఈ నెల 28న పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో పర్యటించనున్న ఆయన అమ్మ ఒడి పథకం నిధులను బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు.. ఇక, కురుపాం పర్యటన కోసం 28వ తేదీ ఉదయం 8 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం జగన్.. 10 గంటలకు చినమేరంగి పాలిటెక్నిక్ కాలేజ్ హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి కురుపాంలోని బహిరంగ సభ వేదిక వద్దకు రోడ్డు మార్గంలో వెళ్తారు.. అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జగనన్న అమ్మ ఒడి పథకం నాలుగో ఏడాది నిధులు విడుదల చేస్తారు.. అనంతరం బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయల్దేరి తాడేపల్లిలోని నివాసానికి చేరుకోనున్నారు..
ఇక, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో.. విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ, సీఎం కార్యాలయ సమన్వయకర్త తలసిల రఘురాం, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, మాజీ మంత్రి పాముల పుష్పశ్రీవాణి, ఎమ్మెల్యే అలజంగి జోగారావు, జిల్లా కలెక్టర్ నిశాంత్‌కుమార్.. ఇప్పటికే చినమేరంగిలోని ప్రతిపాదిత హెలిప్యాడ్, బహిరంగ సభా వేదికను సందర్శించారు.. ఏర్పాట్లను పర్యవేక్షించారు.. సభకు భారీగా ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్నందున బారికేడ్లు ఏర్పాటు చేసి తాగునీటి సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్యేలు అధికారులకు సూచించారు.
కాగా, తమ పిల్లలను స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో చదివిస్తోన్న తల్లుల ఖాతాల్లో జూన్ 28న అమ్మఒడి నగదును జమ చేయనుంది ఏపీ సర్కార్.. కుటుంబంలో చదువుకుంటున్న పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా తల్లి/సంరక్షకుడు ఏటా రూ.15 వేలు చొప్పున అందజేస్తోంది ప్రభుత్వం.. అమ్మఒడి కింద ఇచ్చే రూ.15 వేల నుంచి స్కూల్, మరుగుదొడ్ల నిర్వహణ నిధి కోసం రూ.2వేలు మినహాయిస్తున్నారు. మిగతా రూ.13వేలు మాత్రమే తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. లబ్ధిదారులకు ప్రభుత్వం జారీ చేసిన తెల్ల రేషన్ కార్డు, లబ్ధిదారుడు తల్లికి చెల్లుబాటు అయ్యే ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి. స్కూల్ ఐడీ కార్డు.. ప్రభుత్వ లేదా ప్రైవేటు పాఠశాలల్లో చదివే పిల్లలకు అమ్మ ఒడి పథకం వర్తిస్తుంది. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం.. దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబానికి చెందిన విద్యార్థులు ఈ పథకానికి అర్హులైన విషయం విదితమే..
ఇక, సీఎం వైఎస్ జగన్ పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ఇలా ఉంది…