COVID 19 : మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండడంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది.. కేంద్రం సూచనలతో ఆయా రాష్ట్రాలకు కూడా ఎలాంటి పరిస్థితి విచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధం అవుతున్నాయి.. అందులో భాగంగా ఇవాళ సమీక్ష నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. వైద్య ఆరోగ్యశాఖపై క్యాంపు కార్యాలయంలో సమీక్ష చేపట్టిన ఆయన.. కోవిడ్ తాజా పరిస్థితిపై ఆరా తీశారు.. ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.. కరోనా వ్యాపిస్తుందన్న సూచనలు నేపథ్యంలో అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు.. గ్రామ స్థాయిలోనే పరీక్షలు నిర్వహించి, అక్కడే మందులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సీఎం జగన్.
ఇక, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడతున్నవారికి కోవిడ్ సోకితే వారిని వెంటనే హాస్పిటల్‌కి తరలించేలా చర్యలుండాలన్నారు ఏపీ సీఎం.. అయితే, పరిస్థితి ప్రస్తుతం పూర్తిగా అదుపులోనే ఉందని సీఎంకు వివరించారు అధికారులు. విలేజ్ క్లినిక్స్ స్ధాయిలోనే ర్యాపిడ్ టెస్టులు చేసే వ్యవస్థ ఉందని, అక్కడ ఏమైనా తేలితే వెంటనే ఆర్టీపీసీఆర్‌కు పంపించే ఏర్పాటు చేశామని సీఎంకు తెలిపారు.. రాష్ట్ర వ్యాప్తంగా ఫీవర్ సర్వే ప్రకారం 25 మంది కోవిడ్‌తో ఆస్పత్రిలో చేరారని పేర్కొన్నారు.. కాగా, ముందు జాగ్రత చర్యల్లో భాగంగా అన్నిరకాలుగా సిద్ధం కావాలని సీఎం స్పష్టం చేశారు.. ఎప్పటికప్పుడు పరిస్థితిని చూసుకుంటూ తగిన చర్యలు తీసుకోవాలన్న ఆయన.. ఫ్యామిలీ డాక్టర్, విలేజీ క్లినిక్స్ వ్యవస్ధ కోవిడ్ విస్తృతిని అడ్డుకోవడానికి ఉపయోగపడుతుందన్నారు.. గ్రామాల్లో సర్వే చేసి, లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు నిర్వహించి, వారికి వెంటనే మందులు ఇచ్చేలా చూడాలన్నారు.. ప్రతి విలేజ్ క్లినిక్‌కూ టెస్టింగ్ కిట్స్, మందులు పంపించాలని ఆదేశించారు.. ప్రస్తుతం ఉన్న వేరియంట్‌కు తగినట్టుగా మందులు తెప్పించుకోవాలన్నారు.. ల్యాబ్‌లు అన్నింటినీ పూర్తి స్థాయిలో సన్నద్ధం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి..
ఆక్సిజన్ లైన్లు, పీఎస్‌ఏ ప్లాంట్లు, ఆక్సిజన్ సిలెండర్లు, ఆక్సిజన్ కాన్‌సన్‌ట్రేటర్లు వీటన్నింటినీ కూడా చెక్ చేసి సిద్ధంచేసుకుంటున్నామన్న అధికారులు తెలిపారు. అంతర్జాతీయ విమాన ప్రయాణికులనుంచి ర్యాపిడ్ శాంపిల్స్ తీసుకునేందుకు విమానాశ్రయాల్లో అన్నిరకాలుగా సిద్ధంచేశామన్నారు.. మరోవైపు.. జిల్లాల్లో కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణ పనులపైనా సీఎం సమీక్ష నిర్వహించారు.. మొదటి ప్రాధాన్యతలో నిర్దేశించుకున్న విజయనగరం, మచిలీపట్నం, రాజమండ్రి, ఏలూరు, నంద్యాల్లో షెడ్యూలు ప్రకారం పనులు జరుగుతున్నాయని వెల్లడించారు అధికారులు. మిగిలిన కాలేజీల్లో కూడా పనులను ముందుకు తీసుకెళ్తున్నామన్నారు.. పూర్తయ్యే దశలో పలాస కిడ్నీ స్పెషాల్టీ హాస్పిటల్, కర్నూలులో కేన్సర్ ఇనిస్టిట్యూట్, వైయస్సార్ కడపలో జీజీహెచ్ సూపర్ స్పెషాలిటీ, కేన్సర్ విభాగంతో సహా మూడు బ్లాకులు ఉన్నాయని.. కొన్నిరోజుల్లో ఇవి పూర్తిగా సిద్ధమవుతాయని సీఎంకు వివరించారు అధికారులు. ఈ సమీక్షా సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, సీఎస్ జవహర్ రెడ్డి సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.