CM Revanth Reddy: వరద నష్టంపై సచివాలయంలో కేంద్రమంత్రి శివరాజ్ చౌహాన్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అధికారులు సమావేశమయ్యారు. రాష్ట్రంలో జరిగిన వరద ప్రభావిత ప్రాంతాల దృశ్యాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా సీఎం, అధికారులు వివరించారు. పలు జిల్లాల్లో ఒకే రోజు అత్యధికంగా 40 సెం.మీ వర్షం కురిసిందని కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. వరద ప్రభావిత జిల్లాలోని గ్రామాల్లో పరిస్థితి దారుణంగా ఉందని వివరించారు. రోడ్లు, ఇండ్లు, బ్రిడ్జిలు పూర్తిగా దెబ్బతిన్నాయని, రాకపోకలు స్తంభించాయని సీఎం తెలిపారు. తక్షణ సాయంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున బాధిత కుటుంబాలకు రూ.10వేలు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు.
Read Also: Hyderabad Rain: హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం
ప్రభావిత ప్రాంతాల్లో తీవ్ర పంట నష్టం జరిగిందని, పొలాలన్నీ రాళ్లు, ఇసుక మేటలతో నిండిపోయాయని అధికారులు వివరించారు. మహబూబాబాద్ జిల్లాలో దెబ్బతిన్న రైల్వే ట్రాక్ పరిస్థితిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్రంలో వరద నష్టం దాదాపు రూ.5,438 కోట్లు ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు కేంద్ర మంత్రికి అధికారులు తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ నిధులను రాష్ట్రాలకు విడుదల చేసే విషయంలో ఇప్పుడున్న మార్గదర్శకాలను సడలించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. తాత్కాలిక మరమ్మతులకు తక్షణ సాయం అందించాలని సీఎం కోరారు. శాశ్వత పునరుద్ధరణ పనులకూ తగినన్ని నిధులు కేటాయించాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ఎలా సాయం అందిస్తారో అదే తీరుగా తెలంగాణకూ సాయం అందించాలని సీఎం కోరారు. రెండు తెలుగు రాష్ట్రాలలో జరిగిన వరద నష్టాన్ని ఒకే తీరుగా చూడాలన్నారు. విపత్తుల సమయంలో ప్రజలకు సాయమందించే విషయంలో పార్టీలు, రాజకీయాలు ఉండవని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ స్పష్టం చేశారు.