CM Revanth Reddy: పుట్టపర్తిలో సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి.. సత్యసాయి జయంతి ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న గొప్ప గౌరవంగా భావిస్తున్నానన్నారు. బాబా మనుషుల్లో దేవుని చూశారు.. ప్రేమతో మనుషుల్ని గెలిచారన్నారు. ప్రేమ గొప్పది ప్రేమ ద్వారా ఏమైనా సాధించవచ్చు అని చెప్పి నిరూపించారన్నారు. ప్రభుత్వాలు కూడా కొన్ని సందర్భంలో చేయలేని పనులను బాబా ట్రస్ట్ ప్రజలకు సేవలు అందించడం జరిగిందని కొనియాడారు. ముఖ్యంగా ప్రతివారికి కేజీ టు పీజీ విద్యను అందించాలనే సంకల్పాన్ని గుర్తు చేశారు. చదువు వల్లే జీవితంలో రాణించగలరని బాబా భావించారన్నారు. ప్రభుత్వాలతో పోటీపడి కేజీ నుంచి పీజీ వరకు పేదలకు ఉచితంగా విద్యను అందించి వెలుగులు నింపారని తెలిపారు.
READ MORE: New Captain Sanju Samson: కెప్టెన్‌గా సంజూ శాంసన్.. ఏ జట్టుకో తెలిస్తే షాకే!
మరణం తప్ప తమకు ప్రత్యామ్నాయం లేదు అనుకున్న లక్షల మందిని బ్రతికించి వాళ్ల దృష్టిలో దేవుడిగా మారాడని సీఎం రేవంత్‌రెడ్డి కొనియాడారు. “ముఖ్యంగా పాలమూరు లాంటి వలస జిల్లాలు కరువు కాటకాలతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు తాగునీటి సదుపాయం కల్పించారు.. నా సొంత జిల్లా పాలమూరులో ప్రజల దాహార్తిని తీర్చడమే కాకుండా ఈ పుట్టపర్తి ప్రాంతం అనంతపూర్ జిల్లాలోనూ తాగు నీటి సమస్యను పరిష్కరించారు. మనందరి మనసుల్లో దేవుడుగా శాశ్వతమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మానవ సేవ మాధవసేవాని బోధించడమే కాదు.. సంపూర్ణంగా నమ్మి విశ్వసించి అమలు చేశారు. ప్రపంచంలో కోట్లాది మందికి జీవితంపై స్పష్టతను ఇచ్చి జీవితంలో ఒక లక్ష్యాన్ని చేరడానికి ధైర్యాన్ని అందించారు. భారతదేశ సరిహద్దులు దాటి 140 దేశాలలో భక్తులు ఉండటమే కాకుండా వారి సేవలను విస్తరించి మానవాళికి సేవలు అందిస్తున్నారు.” అని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.