CM Revanth Reddy: కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాలను దక్కించుకోవాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రయోజనాలకు వీసమెత్తు నష్టం వాటిల్లకుండా ట్రిబ్యునల్ ఎదుట సమర్థవంతమైన వాదనలు వినిపించాలని ఆదేశించారు. అందుకు అవసరమైన సాక్ష్యాధారాలు, రికార్డులు, ఉత్తర్వులు సిద్ధంగా ఉంచుకోవాలని నీటిపారుదల శాఖ అధికారులను, న్యాయ నిపుణులను అప్రమత్తం చేశారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో సాగునీటి పరిస్థితి, కృష్ణా గోదావరి జలాలపై ఉన్న అంతరాష్ట్ర వివాదాలు, నీటి వాటాల పంపిణీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.
రాష్ట్ర పునర్వవ్యస్తీకరణ చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల నీటి వాటాలు, ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులను బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ నిర్ణయించాల్సి ఉంది. ట్రిబ్యునల్ ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అభిప్రాయాలను, ఆధారాలను మాత్రమే సేకరించింది. త్వరలోనే ట్రిబ్యునల్ ఎదుట రాష్ట్రాలు తమ వాదనలు వినిపించాల్సి ఉంటుందని, ఆ తర్వాత ట్రిబ్యునల్ నిర్ణయం వెలువడుతుందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. కృష్ణా పరివాహక ప్రాంతానికి సంబంధించి ఇప్పటివరకు ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పులు, ఏయే ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌లను ఇప్పటికే ట్రిబ్యునల్‌కు సమర్పించారు.. జలశక్తి మంత్రిత్వ శాఖకు ఇచ్చిన నివేదికలన్నింటినీ వరుస క్రమంలో సిద్ధంగా ఉంచుకోవాలని, వాటి ఆధారంగా ట్రిబ్యునల్ ఎదుట పకడ్బందీగా వాదనలు వినిపించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
Read Also: Telangana: పంట రుణమాఫీ నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్‌రెడ్డి
అంతర్జాతీయ నీటి సూత్రాల ప్రకారం నదీ పరివాహక ప్రాంతాన్ని బట్టి అదే దామాషా ప్రకారం నీటి కేటాయింపులుండాలి. కృష్ణా పరివాహక ప్రాంతం తెలంగాణలో 70 శాతం ఉండగా.. ఏపీలో కేవలం 30 శాతం ఉంది. అదే వాదనల ప్రకారం 1005 టీఎంసీల్లో 70 శాతం నీటి వాటా తెలంగాణకు దక్కేలా వాదనలు వినిపించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. పోలవరం ద్వారా 80 టీఎంసీల గోదావరి జలాలను ఏపీ కృష్ణా డెల్టాకు వినియోగిస్తున్నందున, వాటికి బదులుగా నాగార్జునసాగర్ ఎగువన 45 టీఎంసీలు తెలంగాణకు నీటి కేటాయింపులున్న విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఆ నీటి వాటాను ఎగువన ఉన్న ప్రాజెక్టుల ద్వారా వినియోగించుకునే ప్రణాళికను అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ నీటి వాటాల పంపిణీ ఇప్పటివరకు పూర్తి చేయనందున, కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీల నిర్ణయాలను ఎందుకు పట్టించుకోవాలని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ట్రిబ్యునల్ నీటి వాటాల పంపిణీ పూర్తయ్యేవరకు గోదావరి, కృష్ణా బోర్డుల జోక్యం ఉండకూడదని సుప్రీం కోర్టులో వాదనలు వినిపించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.
వివిధ ప్రాజెక్టుల ద్వారా కృష్ణా జలాల్లో కోటాకు మించి ఎక్కువ నీటిని ఏపీ తరలిస్తోందని చర్చ జరిగింది. నీటి ప్రవాహాన్ని శాస్త్రీయంగా లెక్కించే టెలీ మెట్రీ విధానంతో దీనికి అడ్డుకట్ట వేసే వీలుందని అధికారులు సీఎంకు వివరించారు. టెలీ మెట్రీ పరికరాలకయ్యే రూ.12 కోట్లు రెండు రాష్ట్రాలు చెరి సగం చెల్లించాలని అధికారులు సీఎంకు వివరించారు. అవసరమైతే మొత్తం డబ్బులు ముందుగా భరించి టెలీమెట్రీ అమల్లోకి తీసుకురావాలని, ఏపీ ఇచ్చినప్పుడు రీయింబర్స్ చేసుకోవాలని సీఎం సూచించారు. నీటి వినియోగం విషయంలో జరుగుతున్న అన్యాయానికి అడ్డుకట్ట వేయాలని అధికారులను ఆదేశించారు. కృష్ణాపై ఉన్న ప్రాజెక్టులన్నింటి ద్వారా ఏ రాష్ట్రం ఎన్ని నీళ్లు వాడుకుంటుందో లెక్కలు తీయాలని ఆదేశించారు. శ్రీశైలం, పోతిరెడ్డిపాడు, బంకంచెర్ల హెడ్ రెగ్యులేటరీ, తెలుగు గంగ, కేసీ కెనాల్, హంద్రీ నివా, గాలేరు నగరి, వెలుగోడు ప్రాజెక్టుల నుంచి ఎంత నీటిని తరలిస్తున్నారనే వివరాలన్నీ రికార్డు చేయాలని చెప్పారు.
Read Also: Students Protest: కోఠి మహిళా కళాశాలలో ఆందోళనకు దిగిన విద్యార్థినులు
సీతారామ ప్రాజెక్టు, సమ్మక్క బ్యారేజీకి అవసరమైన అనుమతులు తీసుకోవాలని, పూర్తి ఆయకట్టుకు నీరందించేందుకు అవసరమైన పనులన్నీ తొందరగా చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టులు, నీటి వాటాలకు సంబంధించి సమర్థంగా వాదనలు వినిపించేందుకు 2014 నుంచి ఇప్పటివరకు ఉన్న జీవోలు, తీర్పులే కాకుండా.. ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన జీవోలు, మెమోలు, ప్రాజెక్టుల డీపీఆర్లు, అప్పటి నుంచి నీటి వాటాల్లో తెలంగాణకు జరిగిన నష్టాలపై సమగ్రంగా నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. వీటి ఆధారంగా అన్ని వేదికలపై తెలంగాణ ప్రయోజనాలను పరిరక్షించేలా సమర్థమైన వాదనలు వినిపించాలని సూచించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, స్టాండింగ్ కౌన్సిల్ వైద్యనాథన్, ఏజీ సుదర్శన్ రెడ్డి, అడిషనల్ ఏజీ రజనీకాంత్ రెడ్డి, ప్రభుత్వం తరఫు న్యాయవాది ఖుష్ వోరా, సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, సీఎం సెక్రటరీ మాణిక్ రాజ్, నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఇరిగేషన్ కార్యదర్శి ప్రశాంత్ పాటిల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.