CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!

Futer City

Futer City

CM Revanth Reddy: రంగారెడ్డి జిల్లా మీర్కాన్‌పేట్‌లో “ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్” భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి, డీజీపీ శివధర్ రెడ్డి, సీపీ సుధీర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి పనుల్లో ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. ఏ అభివృద్ధి కార్యక్రమమైనా స్థానిక ప్రజాప్రతినిధులను తప్పకుండా ఆహ్వానించాలని అధికారులకు సూచించారు. పాసులు ఇచ్చి వారిని కార్యక్రమాలకు పిలవాలని, వారిని భాగస్వామ్యం చేస్తేనే సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారం దొరుకుతుందని అన్నారు.

ఫ్యూచర్ సిటీ పరిధిలోని సర్పంచ్‌లకు తప్పనిసరిగా ఆహ్వానం ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు. తమను కార్యక్రమాలకు పిలవడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. ఇక, ఫ్యూచర్ సిటీ పరిధిలోకి రావాలనుకునే గ్రామాలు గ్రామసభల ద్వారా తీర్మానాలు చేసి కలెక్టర్‌కు పంపించాలని, సంబంధిత ఇన్‌ఛార్జి మంత్రులకు కూడా వివరాలు తెలియజేయాలని సూచించారు.

భూమి సేకరణ విషయంలో రైతులతో చర్చించి, పరస్పర అవగాహనతో ముందుకు వెళ్లాలని సీఎం పేర్కొన్నారు. మాట్లాడకుండా భూమి తీసుకుంటే అపోహలు ఏర్పడతాయని, అందుకే పారదర్శకంగా వ్యవహరించాలని చెప్పారు. ఫ్యూచర్ సిటీ ప్రాంతంలో భూమి ధరలు భారీగా పెరిగాయని, గతంలో ఎకరం రూ.3 కోట్లు ఉండగా ఇప్పుడు రూ.6 కోట్లకు పెరిగిందని వివరించారు.

ఫ్యూచర్ సిటీ అభివృద్ధిని ప్రపంచ స్థాయి నగరాలైన సింగపూర్, టోక్యో, న్యూయార్క్ సిటీ తరహాలో తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని సీఎం తెలిపారు. జూన్ 2 నాటికి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఇకపై అక్కడి నుంచే సమీక్షలు నిర్వహించి పెట్టుబడులను ఆకర్షించనున్నట్లు చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణ సమయంలో కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయని, కానీ ఆ ప్రాజెక్ట్ విజయవంతమైందని గుర్తుచేశారు. అదే విధంగా ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్‌ను కూడా అందరూ కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.