CM Revanth Reddy: హైదరాబాద్‌ను కులీకుతుబ్‌షా, నిజాంలు విస్తరించారని.. దాంతో నగరానికి ప్రపంచ గుర్తింపు వచ్చిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. హైటెక్ సిటీ అంటే నవ్వారు, ఔటర్ రింగు రోడ్డును అడ్డుకున్నారని గుర్తు చేశారు. ఆనాడు అభివృద్ధి జరగొద్దని కుట్రలు కుతంత్రాలు చేశారని.. ఇప్పుడు ఫ్యూచర్ సిటీని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని సీఎం తెలిపారు. భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధి సంస్థ (FCDA)ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. FCDA లోగో, వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభ ప్రసంగించారు. ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని అమెరికా వెళ్లి మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. భవిష్యత్ నగరాన్ని రద్దు చేస్తామంటే బండకేసి కొడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. అలాంటివారికి భవిష్యత్ ఉండదన్నారు. నిన్న 2 గంటల వానకే హైదరాబాద్‌లో నీరు నిలిచిపోయిందని.. అంతర్జాతీయ నగరం అని గొప్పగా చెప్పుకుంటే సరిపోదన్నారు. ఇదేనా మీ పదేళ్ల అభివృద్ధి..? అని బీఆర్‌ఎస్‌ను ప్రశ్నించారు. రోడ్లపై వరద పారుతుంటే ఎవరిది బాధ్యత? అని నిలదీశారు. ఈ వరద పరిస్థితి మీ కబ్జాల పుణ్యమే కదా.. పదేళ్లు అభివృద్ధి చేశామన్న వాళ్లు వరదపై మాట్లాడాలన్నారు. రేపటి భవిష్యత్తుకు ఈనాడే పునాదులు వేసి ప్రపంచానికి అద్భుతమైన నగరాన్ని అందించబోతున్నామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ నగరానికి గొప్ప చరిత్ర ఉందని.. 200 యేళ్ల క్రితం హైదరాబాద్ ను విస్తరించడం వల్ల సికింద్రాబాద్‌తో కలిసి జంట నగరాలుగా విలసిల్తుతున్నాయన్నారు.. రాష్ట్రానికి 60 శాతం ఆదాయం ఇక్కడి నుంచి వస్తోందని తెలిపారు. బంగారానికి కంటే రంగారెడ్డి జిల్లా భూములకు విలువ ఎక్కువగా ఉందన్నారు. 1908 లో తుఫాన్ వచ్చి వేలాది మంది ప్రాణాలు కోల్పోతే ఆ నాటి నిజాం నవాబు మూసీ నది పైన నిర్మాణాలు చేశారని తెలిపారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో యుద్ధ సామాగ్రిని ఉంచడం వల్ల శత్రు దుర్భేద్యంగా మారిందన్నారు. ఆ నాటి పాలకులు సైబరాబాద్‌ను నిర్మించి గొప్ప నగరాన్ని ప్రపంచానికి అందించారన్నారు. హైటెక్ సిటీ, అవుటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం, జీనోమ్ వ్యాలీ లాంటివి వద్దే వద్దున్నారని.. ఆ నాడు కూడా అనేక కుట్రలు , కుతంత్రాలు చేశారని మండిపడ్డారు.
మూసీలో మురికి కంటే ఎక్కువ విషాన్ని చిమ్మారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. “ఆ నాటి పాలకులు హైటెక్ సీటీ, అవుటర్ రింగ్, అంతర్జాతీయ ఎయిర్ పోర్టు , జీనోమ్ వ్యాలీ లాంటి తీసుకురాకపోతే ఈ నాడు 10 లక్షల మంది కి ఉపాధి లభించేదా? రావణాసురుడు, శుక్రాచార్యుడు, మారీచుడు, సుభావుడు లా ఆ నాడు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు శుక్రాచార్యుడు ఫామ్ హౌస్ లో ఉండి మారీచుడు, సుభావుడిని పంపించాడు. భారత్ ఫ్యూచర్ సిటీ ని రద్దు చేస్తామని పెద్ద రాక్షసుడు, చిన్న రాక్షసులు అంటున్నారు. ప్రపంచానికి ఒక దిక్సూచి గా ఫ్యూచర్ సిటీని గొప్ప నగరంగా తీర్చిద్దాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఉంది. వాళ్లని తెలంగాణ ప్రజలు తిరస్కరించారు..వాళ్లకు గతమే తప్ప భవిష్యత్తు లేదు. ఫ్యూచర్ సిటీ ని రద్దు చేస్తామంటే వచ్చే సారి ప్రతి పక్ష హోదా కూడా రాదు. ఈ ప్రాంత ప్రజలు బండకేసి కొడతారు. సరిగా 150 రోజుల్లో ప్యూచర్ సిటీ అథారిటీ డెవలప్మెంట్ కార్యాలయాన్ని ప్రారంభించుకున్నాం. 2034 నాటికి వన్ ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి భారత్ ఫ్యూచర్ సిటీ కీలకం కావాలి. తొలకరి వర్షం పడితేనే హైదరాబాద్ లో రోడ్డులు ఎక్కడిక్కడ స్తంభించిపోయాయి. కిలోమీటర్ దూరానికి రెండు నుంచి నాలుగు గంటల పట్టింది. 100 కోట్ల కు ఎకరం అమ్మినమని జబ్బలు చర్చుకున్న వాళ్లు నిన్నటి వరదలకు సమాధానం చెప్పాలి. ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని, కుంటలను చెరపట్టడం వల్లనే చెరువుల్లో ఉండాల్సిన నీళ్లు కాలనీలు, బస్తీలకు వచ్చాయి. ప్రభుత్వ భూములు, చెరువులను , కుంటలను ఆక్రమించుకున్న వారి కట్టడాలను నిర్ధాక్ష్యణంగా కూలుస్తున్నాం.. మేం ఎవరైనా ఇంచు భూమైనా తీసుకున్నామా..? ఆక్రమణలను తొలగించి చెరువులను పునరుద్దరిస్తున్నాం. లేక్ ఎకనామీ ని తయారు చేస్తున్నాం.. మహిళా సంఘాలు వ్యాపారం చేసుకునేలా చేస్తున్నాం. రాజేంద్రనగర్ లో చెరువు ఆక్రమణలను తొలగించి పునరుద్దరించాం. కూకట్ పల్లి నల్ల చెరువు, అంబర్ పేట లో బతుకమ్మ కుంట ను పునరుద్దించాం. బీఆర్ఎస్ నాయకుడు ఎడ్ల సుధాకర్ రెడ్డి బతుకమ్మ కుంటను ఆక్రమించి హెలికాఫ్టర్ లో పూలు చల్లాడని గత ప్రభుత్వం ఆయనకు రాసి ఇచ్చింది. బతుకమ్మ కుంటను దుర్మార్గులు చెరపడితే వాళ్ల పని పట్టి పునరుద్దించాం. గండి పేట, హిమాయత్ సాగర్ ను గొప్ప వ్యక్తులు ఆక్రమిస్తే వాళ్లను ఖాళీచేయించదానికి ప్రయత్నం చేస్తున్నాం. ముంబయి లో వర్షం వస్తే జనం బయటకు రాని పరిస్థితి ఉంది. చెన్నైలో వర్షం వస్తే పడవల్లో తిరుగుతున్నారు.. కొల్‌కత్తాలో శాంతిభద్రతలు లేవు. బెంగళూరులో ట్రాఫిక్ జాంలు ఉన్నాయి. హైదరాబాద్ లో కబ్జాకోరుల పనిపడుతున్నాం, ప్రపంచం మన వైపు చూస్తుంది. జూన్ 10, 2026 న తేదీన సువర్ణ అధ్యాయాన్ని సృష్టించాం. గ్రీన్ ఫార్మా, జీసీసీ, ఐటీ కంపెనీలు లతో పాటు ప్రపంచంలోని ప్రసిద్ది గాంచిన 500 పెద్ద కంపెనీలను ఫ్యూచర్ సిటీకి రప్పించబోతున్నాం. మరో గ్లోబల్ సమ్మిట్ పెట్టి ప్రపంచ దేశాలను ఇక్కడికి రప్పించాం.. ఫ్యూచర్ సిటీలో కొన్ని గ్రామాలను ఈ రోజు కలిపాం.. ఫ్యూచర్ సిటీ ని ప్రపంచానికి గొప్ప నగరంగా రాణిస్తుందనడంలో అనుమానం లేదు. అడ్డుపడిన వాళ్లను అడ్డంగా తొక్కుకుంటు ఈ ప్రాంతం వాళ్లే వెళ్తారు. ఈ నగరాన్ని ఇక్కడి వాళ్లే కాపాడుకుంటారు. ప్రపంచానికి దిక్సూచి గా ఈ ప్రాంతం ఉంటుంది.. కాలుష్య రహిత గొప్పనగరంగా తీర్చిదిద్దతా. వీలైనప్పుడల్లా ఫ్యూచర్ సిటీ అథారిటీ కార్యాలయానికి వస్తాను.” అని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

