Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
- ఉమ్మడి చిత్తూరు జిల్లాకు దక్కని మంత్రి పదవి..
- ఐదేళ్ళు పోరాడింది ఇందుకేనా అంటూ నేతల నిర్వేదం..
- సీనియర్స్ సైతం నియోజకవర్గాలకే పరిమితం..
- దూకుడుగా జిల్లా వైసీపీ, టీడీపీ నుంచి నో రియాక్షన్..
- వైసీపీ ఆరోపణలు, ప్రచారాలను తిప్పికొట్టలేకపోతున్న వైనం..
- టీడీపీలోని నిర్లిప్తత వైసీపీకి కలిసొస్తోందన్న అభిప్రాయం..
- తాజాగా డీఎస్సీ విషయంలో లోకేష్‌ని టార్గెట్ చేసినా నో రియాక్షన్..
- సినిమా స్టైల్ డైలాగ్స్‌తో రోజా సవాల్ చేసినా స్పందన కరవు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: ప్రత్యర్థుల్ని ఎప్పుడెప్పుడు ఎలా ఇరుకున పెడదామా అని కూచుకుని కూర్చోవడం రాజకీయ సహజ లక్షణం. అందునా…. అవకాశం అందివస్తే… అస్సలు వదులుకోరు. కానీ… ఉమ్మడి చిత్తూరు జిల్లా టీడీపీ నేతల పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా, కాస్త తేడాగా కూడా కనిపిస్తోందని అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. అంతకు ముందు ఎన్నడూ లేని విధంగా…. గత ఎన్నికల్లో… జిల్లాలోని మొత్తం 14 అసెంబ్లీ సీట్లకుగాను 12 స్థానాలను కైవసం చేసుకుంది కూటమి. మొదట్లో అంతా బాగానే ఉందని అనుకున్నా… తర్వాత జిల్లా ఎమ్మెల్యేలకు, పార్టీ కేడర్‌కు ఊహించని షాక్ ఇచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఉమ్మడి జిల్లాకు ఒక్క మంత్రి పదవి కూడా రాకపోవడంతో డీలా పడ్డారట నేతలు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఐదేళ్లు పోరాటం చేసి కేసులు పెట్టించుకున్నది ఇందుకేనా అంటూ… కొందరు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అదే కారణంతో… జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను, వైసీపీ చేస్తున్న ప్రచారాలు, ఆరోపణలను ఏమాత్రం పట్టించుకోకుండా ఎవరికి వారు సొంత నియోజకవర్గాలకే పరిమితం అవుతున్నారు. గోశాలతో మొదలుపెట్టి తిరుమల కేంద్రంగా నడిచిన రచ్చ, తోతాపూరి మామిడి రైతుల ఆందోళనలు, ములకలచెరువులో నకిలీ మద్యం తయారీ, భూ అక్రమాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే… గత రెండేళ్లలో చిత్తూరు జిల్లా వైసీపీ నేతలు చంద్రబాబును, ప్రభుత్వాన్ని గట్టిగా టార్గెట్ చేసిన వ్యవహారాలు చాలానే ఉన్నాయి. ధర్నాలు, పోరాటాలతో ప్రభుత్వం ఇబ్బందిపడ్డ సందర్భాలు సైతం ఉన్నాయి.
కానీ.. ప్రతిపక్షం అటాకింగ్‌ను ఏ మాత్రం పట్టించుకోకుండా టీడీపీ సీనియర్ ఎమ్మెల్యేలు సైతం తమ నియోజకవర్గాలకే పరిమితం అయ్యారు. దీంతో… పార్టీ పెద్దలపై జిల్లా తమ్ముళ్లు, ఎమ్మెల్యేలు ఎందుకంత అసంతృప్తిగా ఉన్నారన్న చర్చ జోరుగా జరుగుతోంది. ఒకప్పుడు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుపై ఈగ వాలనీయకుండా చూసుకున్న కిషోర్ కుమార్ రెడ్డి, అమర్ నాథ్ రెడ్డి, గాలి భాను ప్రకాష్, నాని, బొజ్జల లాంటి నేతలు ఇప్పుడసలు జిల్లా విషయాలను పట్టించుకోవడమే మానేశారన్నది టీడీపీ కేడర్‌లో బలంగా ఉన్న అభిప్రాయం. వైసీపీ తెరపైకి తెచ్చిన అంశాలన్నీ పార్టీకి డ్యామేజ్ కలిగించేలా ఉన్నప్పటికీ జిల్లా ఎమ్మెల్యేలు మౌనంగా ఉండడం ప్రతిపక్షానికి ప్లస్ అవుతోందన్న విశ్లేషణలు సైతం ఉన్నాయి. ఇన్నాళ్ళు చంద్రబాబును తిడితే పట్టించుకోకుండా ఉన్న జిల్లా నేతలు, కనీసం లోకేష్‌కు మద్దతుగానైనా మాట్లాడతారని భావించారట జిల్లా కార్యకర్తలు. అది కూడా లేకపోవడంతో… అసలేం జరుగుతోందో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారట. తాజాగా డీఎస్సీ అక్రమాల పేరిట లోకేష్‌ను టార్గెట్ చేస్తూ వైసీపీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తోంది.
Also Read
ఆ క్రమంలోనే… జిల్లా వైసీపీ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి, రోజా, నారాయణ స్వామి లాంటి వారు తీవ్ర స్థాయిలో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్యంగా మాట్లాడుతున్నా పార్టీ జిల్లా లీడర్స్ నుంచి నో రెస్పాన్స్. ఆఖరికి నిన్నగాక మొన్న తిరుపతి ఇన్చార్జ్గా బాధ్యతలు తీసుకున్న జేబీ శ్రీనివాస్ భూమన కుటుంబానికి కౌంటర్ ఇచ్చారే తప్ప, ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్లకు మాత్రం… మాకేం కనపడలేదు, వినపడలేదన్నట్టుగా ఉండటాన్ని కేడర్ జీర్ణించుకోలేకపోతోందట. పదవులు రాలేదనే బాధతో సీనియర్ నేతలు అలకలో ఉన్నారు, వాళ్ళకు చంద్రబాబు మీద కోపం ఉందని అనుకున్నా… లోకేష్ విషయంలో కూడా ఎవ్వరూ నోరెత్తకపోవడం చూస్తుంటే… ఎక్కడో ఏదో తేడా కొడుతోందన్న అనుమానాలు పెరుగుతున్నాయి. దీంతో… పార్టీ పెద్దలకు, జిల్లా ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ చాలా ఉందని, అందుకే ఇలాంటి పరిస్థితి వచ్చిందన్న మాటలు గట్టిగానే వినపడుచున్నాయి. డీఎస్సీ విషయంలో చర్చకు సిద్ధమని, “టైమ్ నువ్వు చెప్పినా సరే… నన్ను చెప్పమన్నా సరే, ప్లేస్ నువ్వు చెప్పినా సరే… నన్ను చెప్పమన్నాసరే అంటూ… మొన్నటికి మొన్న మాజీ మంత్రి రోజా… సినిమా డైలాగ్ లెవల్లో చెబితే… జిల్లా నేతలు ఒక్కరంటే ఒక్కరు కూడా కిక్కురుమనకపోవడంపై కేడర్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. చివరికి టీడీపీ వాళ్ళేకాదు, అటు వైసీపీ వాళ్ళు సైతం వీళ్ళేంటి… ఇలా ఉన్నారని మాట్లాడుకుంటున్నారట.
ఈ అలకలు ఇలాగే కొనసాగితే మొదటికే మోసం వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. అదే విషయాన్ని కొందరు చనువు తీసుకుని ఎమ్మెల్యేల దగ్గర ప్రస్తావిస్తే…ప్రతిపక్షంలో ఉన్న ఐదేళ్ళు ఎక్కడా లేని విధంగా కేసులతో జైలు పాలైన మమ్మల్ని ఇప్పుడు గుర్తించనప్పుడు, మేమెందుకు మాట్లాడాలంటూ సమాధానం చెబుతున్నట్టు తెలిసింది. జిల్లాకు మంత్రి పదవి లేదు, మాకు కనీస గౌరవం దక్కడం లేదు, గెలిచి రెండేళ్లవుతున్నా సొంత జిల్లా ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు సమావేశమైన దాఖలాలు లేవు, అలాంటప్పుడు మేం తెగ పూసేసుకోవడం ఎందుకంటూ టీడీపీ ఎమ్మెల్యేలు అంటున్నట్టు తెలిసింది. వాళ్ళు మమ్మల్ని వదిలేశారు కాబట్టి…మేం కూడా అలాగే ఉన్నామంటున్న ఉమ్మడి చిత్తూరు ఎమ్మెల్యేలను టీడీపీ అధిష్టానం ఎలా సెట్ చేస్తుందో చూడాలంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.
తాజావార్తలు
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
-
AP Municipal Elections: ఎస్టీలకు మంగళగిరి, తాడేపల్లి మేయర్.. 8 మంది మహిళలకు మేయర్లుగా అవకాశం?
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
ట్రెండింగ్
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!