CM Revanth Reddy: హైదరాబాద్ లోని బుద్ధ భవన్ సెకండ్ బ్లాక్ భవనంలో ఏర్పాటు చేసిన హైడ్రా పోలీస్ స్టేషన్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ తర్వాత ఏర్పాటు చేసిన సభలో పాల్గొని, హైడ్రా ఏర్పాటు పట్ల తన అభిప్రాయాలను వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో హైడ్రాను ఏర్పాటు చేసిందని, ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించేందుకు ఇది కీలకమైన అడుగు అని ఆయన అన్నారు. ఈ సందర్బంగా ఆయన హైడ్రా అధికారులను మనస్ఫూర్తిగా అభినందించారు. అలాగే, దేశ ప్రజలు ఆమోదించిన రాజ్యాంగంలో ఇప్పటివరకు 100కి పైగా సవరణలు చేశామని, ఇది దేశ పరిపాలనలో అవసరమైన మార్పులను సూచించే సంకేతమని అయన అన్నారు. చాలా ముఖ్యమంత్రులు గతంలో సవరణలు చేసి, చట్టాలు రూపొందించారని.. అదే ధోరణిలో ప్రభుత్వ వ్యవస్థల్లో సమన్వయం అవసరమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Read Also: Asaduddin Owaisi: ‘జిహాద్’ పేరుతో హత్య చేయాలనుకుంటున్నారా..? అసదుద్దీన్ ఒవైసీ ఘాటు వ్యాఖ్యలు.!
ఇక హైదరాబాద్ నగర నిర్మాణం గురించి మాట్లాడుతూ.. నిజాం పాలనలో వరదలు రావడంతో మోక్షగుండం విశ్వేశ్వరయ్య సహకారంతో జంట జలాశయాలు నిర్మించారని, నిజాం పాలనలో ఏర్పడిన గొప్ప నిర్మాణాలు నేటికీ నిలిచివున్నాయన్నారు. కానీ, మనం ఇప్పుడు పాతదాన్ని వదిలేసి కొత్త ప్రాంతాల వైపు వెళ్తున్నామని.. “ఓల్డ్ సిటీ అంటే.. ఒరిజినల్ సిటీ” అని, దానిపై మనం బాధ్యత వహించాలని అన్నారు. అలాగే హైడ్రా గురించి అపోహలు పెంచుతున్న కొందరిపై సీఎం ఘాటు వ్యాఖ్యలు చేశారు. “హైడ్రా అంటే కేవలం కూల్చడమే కాదు. అది ఆస్తుల రక్షణ, విపత్తుల సమయంలో స్పందించే ఒక వ్యవస్థ” అని అన్నారు. వర్షాకాలంలో ఇళ్లలోకి నీళ్లు ప్రవహించి ప్రజలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అప్పట్లో వారికి రూ. 10వేలు ఇచ్చారు.. కానీ, వారి ఆస్తులు లక్షల్లో కోల్పోయారు.. ఇది మన దౌర్భాగ్యం అని అన్నారు.
అలాగే చెరువులు, నాలాల కబ్జా గురించి మాట్లాడుతూ.. నగరంలోని చెరువులు, నాలాలు పూర్తిగా ఆక్రమించబడ్డాయి. ‘లేక్ వ్యూ’ పేరుతో చెరువుల్లో ఇళ్లు కడుతున్నారు. ఇటువంటి ఆక్రమణలే వరదలకు కారణం అవుతున్నాయని అన్నారు. “మూసీ నది మనకు వరం” అని వ్యాఖ్యానించిన సీఎం, సబర్మతి, యమునాలను పునరుద్ధరించినట్లే, మూసీ నదిని కూడా పునరుద్ధరించుకోవచ్చు. ఇందులో తప్పేమీ లేదు. ప్రకృతి పరిరక్షణకు హైడ్రా అవసరం అని అన్నారు. అలాగే రియల్ ఎస్టేట్ అభివృద్ధిపై వచ్చిన విమర్శలకు సమాధానమిచ్చిన సీఎం.. 400 ఎకరాల్లో ఐటీ కంపెనీ ఏర్పాటు చేయాలని అనుకుంటే, అది ప్రకృతిని దెబ్బతీయడమంటున్నారు. కానీ, నిజంగా రియల్ ఎస్టేట్ అభివృద్ధి కావాలంటే ప్రకృతిని పరిరక్షించాల్సిందే అన్నారు చివరిగా హైడ్రా మీద నిందలు మోపుతున్న వారిని పట్టించుకోనని స్పష్టం చేసిన సీఎం, ప్రకృతి మీద మన బాధ్యతను గుర్తించి, సమన్వయం ఉన్న పరిపాలన ద్వారా ప్రజలకు సేవ చేయడమే హైడ్రా లక్ష్యం అని వ్యాఖ్యానించారు.