NTV Telugu Site icon

CM Revanth Reddy : రాజశేఖర్‌ రెడ్డి చెప్పులు మోసింది, ఊడిగం చేసింది కేసీఆర్‌ కాదా..?

Cm Revanth Reddy Speech

Cm Revanth Reddy Speech

CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నేడు వికారాబాద్, నారాయణపేట జిల్లాల్లో పర్యటించిన సీఎం, అప్పకపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బంగలి దేవమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ, సీఎం సలహాదారు వెం నరేందర్ రెడ్డి, ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అనంతరం బహిరంగ సభలో సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్‌కు ప్రజలు పదేళ్లు అవకాశం ఇచ్చినప్పటికీ, ఆ కాలంలో పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తిచేయలేకపోయారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఈ ప్రాజెక్టు పూర్తయి ఉండి ఉంటే, నేటి రోజున ఆంధ్రప్రదేశ్‌తో ఇలాంటి వివాదాలు నెలకొనేవి కావని వ్యాఖ్యానించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మక్తల్, నారాయణపేట, కొడంగల్ ప్రాంతాల్లో ప్రాజెక్ట్ పనులు ప్రారంభించామని తెలిపారు. పాలమూరు ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తుంటే, కేసీఆర్ ఓర్వలేక తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. పాలమూరు ప్రజలు కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టినప్పటికీ, ఆయనే పదేళ్లు పాలమూరు ప్రాంతాన్ని ఎండబెట్టారని తీవ్ర స్థాయిలో ఆరోపించారు.

Minister Kollu Ravindra: జగన్‌కు భయం.. అందుకే అసెంబ్లీకి రావడంలేదు..!

పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించింది కాంగ్రెస్ ప్రభుత్వమే, దీనిని పూర్తి చేసే బాధ్యత కూడా తమదేనని స్పష్టంచేశారు. ప్రాజెక్టు డిజైన్ మార్చడం ద్వారా కేసీఆర్ పాలమూరు ప్రజలను ఏడాది పాటు గోస పెట్టారని ఆరోపించారు. రాజశేఖర్‌ రెడ్డి చెప్పులు మోసింది, ఊడిగం చేసింది కేసీఆర్‌ కాదా..? వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాలంలో పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీళ్లు తరలించేందుకు కేసీఆర్ సహకరించాడని, ఆర్డీఎస్ ద్వారా అదనపు జలాలను తరలించినప్పుడు హరీష్ రావు వైఎస్ కేబినెట్‌లో మంత్రిగా ఉన్నారని గుర్తుచేశారు. ముచ్చుమర్రి ప్రాజెక్టు నిర్మాణం సమయంలో కేసీఆర్ కేవలం మౌనంగా ఉండిపోయారని రేవంత్‌ రెడ్డి ధ్వజమెత్తారు.

కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు, ముందుగా కేటీఆర్, హరీష్ రావు, కవితల అవినీతిని తహతహలాడించాలని సీఎం రేవంత్ సూచించారు. కేటీఆర్ కార్ రేసులో అవినీతికి పాల్పడినప్పటికీ, హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో ప్రజా ధనం దోచుకున్నప్పటికీ, లిక్కర్ కుంభకోణంతో కవిత తెలంగాణ పరువును దిగజార్చినా, కేసీఆర్ మాత్రం వాటిపై స్పందించలేదని ఆరోపించారు. పాలమూరు ప్రజలకు కేసీఆర్ చేసిన పాపాలే శాపంగా మారాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్‌ రెడ్డి.

తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 50,000 ఉద్యోగాలు, కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, రుణ మాఫీ, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్లు వంటి అనేక పథకాలను అమలు చేశామని వివరించారు. ఏ గ్రామంలో అయినా బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. అలాగే, ఎనిమిది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఎస్సీ వర్గీకరణను పూర్తి చేసి, చారిత్రాత్మక కుల గణనను ప్రారంభించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

Sambhal violence: సంభాల్ అల్లర్లపై యోగీ సర్కార్ ఉక్కుపాదం.. 3000 పేజీల చార్జిషీట్..