తెలంగాణ రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త అందించారు. ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుందని ప్రకటించారు. రైతులు అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు.ఇన్ని రోజులు ధాన్యం అమ్ముకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొనేవారు లేక ఇంట్లోనే ధాన్యం పేరుకుపోయిన పరిస్థితి. ఈ తరుణంలో వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్.. ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రకటించారు. ప్రతి గింజ ప్రభుత్వమే కొంటుందన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. మద్దతు ధర ప్రకారమే కొనుగోలు చేస్తామని సీఎం స్పష్టం చేశారు.
గత సీజన్‌లో రాష్ట్ర వ్యాప్తంగా 6 వేల 545 ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేశామని, యధావిధిగా ఈ ఏడాది కూడా ఆ కేంద్రాలన్నింటి ద్వారా ధాన్యం సేకరణ జరపాలని సీఎం పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. ధాన్యాన్ని శుభ్రపరచుకుని.. తేమ శాతం లేకుండా ఎండపోసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు సూచించారు. మద్దతు ధర చెల్లించేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. మరోవైపు పోడు సమస్యలను కూడా పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. పోడు భూముల సమస్య పరిష్కారం, అడవుల పరిరక్షణ, హరితహారంపై జిల్లా కలెక్టర్లు, అటవీశాఖ ఉన్నతాధికారులతో ఈ నెల 23న ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ అంశాలన్నింటిపై సమగ్ర ప్రణాళికను రూపొందించనున్నారు.