మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సీఎం కేసీఆర్ ను కలిశారు. ముస్లీం పర్సనల్ లా బోర్డు ప్రతినిధులతో కలిసి ఆయన సోమవారం ప్రగతి భవన్ కు వెళ్లారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న ఉమ్మడి పౌర స్మృతిని వ్యతిరేకించాలని వారు కేసీఆర్ ను కోరారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. దేశ ప్రజల నడుమ చిచ్చు పెడుతున్న బీజేపీ కేంద్ర ప్రభుత్వం, ఉమ్మడి పౌర స్మృతి ( యూనిఫామ్ సివిల్ కోడ్) పేరుతో మరోమారు దేశ ప్రజలను విభజించేందుకు కుయుక్తులు పన్నుతున్నదని మండిపడ్డారు.
Also Read : High Court: కోర్టు ధిక్కరణ కేసు.. ఐఏఎస్ అధికారికి జైలు శిక్ష, జరిమానా
విభిన్నప్రాంతాలు, జాతులు, మతాలు, ఆచార వ్యవహారాలు, సంస్కృతులు కలిగి.. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన భారత ప్రజల ఐక్యతను చీల్చేందుకు కేంద్ర ప్రభుత్వ తీసుకునే నిర్ణయాలను వ్యతిరేకిస్తామన్నారు కేసీఆర్. ఉమ్మడి పౌర స్మృతి (యుసీసీ) బిల్లును వ్యతిరేకిస్తున్నామని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్న యుసీసీ నిర్ణయం దురుద్దేశంతో కూడుకున్నదని ఆయన ఆరోపించారు.
Also Read : Foxconn-Vedanta Deal: వేదాంతకు షాక్ ఇచ్చిన ఫాక్స్‌కాన్.. కారణం చెప్పకుండానే డీల్ బ్రేక్
దేశంలో ఎన్నో పరిష్కరించాల్సిన సమస్యలున్నా పట్టించుకోకుండా గత తొమ్మిదేండ్లుగా దేశ ప్రజల అభివృద్ధి ని ప్రజా సంక్షేమాన్ని విస్మరించింది బీజేపీ ప్రభుత్వమని ఆయన అన్నారు. దేశంలో పనులేమీ లేనట్టు.. ప్రజలను రెచ్చగొట్టి అనవసరమైన గొడవలు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకునేందుకే యుసీసీ అని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ తీసుకోవాలనుకుంటున్న యుసీసీ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని మరో ఉద్ఘాటించారు. బిల్లును రాబోయే పార్లమెంటు సమావేశాల్లో వ్యతిరేకిస్తామన్నారు.