అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సామాజిక న్యాయ యాత్ర పేరిట చేపట్టనున్న బస్సుయాత్రను విజయవంతం చేయడానికి ప్రాంతాల వారీగా బాధ్యులను నియమించారు. అంతేకాకుండా.. బస్సు యాత్ర మీటింగుల ఏర్పాట్లను సమన్వయ పరచడానికి కూడా ముగ్గురు పార్టీ నాయకులను సీఎం జగన్ నియమించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి జగన్ పిలుపునిచ్చారు.
దసరా పండుగ నేపథ్యంలో, పండుగ ముగించుకుని అక్టోబరు 26 నుంచి బస్సు యాత్ర మొదలుపెట్టాలని సీఎం జగన్ తెలిపారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ సమావేశాలు జరగాలని పార్టీ శ్రేణులకు తెలిపారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలనుంచి ప్రతి రోజూ ఒక మీటింగు చొప్పున మొత్తంగా మూడు మీటింగులు నిర్వహించాలని పేర్కొన్నారు. ఇది అత్యంత ముఖ్యమైన కార్యక్రమం, అత్యంత విజయవంతంగా మీటింగులు జరిగేలా చూడాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే లేదా పార్టీ ఇంఛార్జి సహా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన నాయకులు ఈ సమావేశాల్లో మాట్లాడాలని సీఎం జగన్ అన్నారు.
Read Also: Raviteja: సాగరకన్యతో టైగర్ డ్యాన్స్.. ఆ ఆటిట్యూడ్ కు ఫిదా
52 నెలల పరిపాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, నిరుపేద వర్గాలకు చేసిన మేలును ఈ మీటింగుల ద్వారా వివరించి ఆయా వర్గాలకు మరింత చేరువ కావాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వచ్చే ఎన్నికలు పేదవాడికి, పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధం.. జరుగుతున్నది కులాల వార్ కాదు, ఇది క్లాస్ వార్ అని తెలిపారు. పేదవాడు మన పార్టీని ఓన్ చేసుకోవాలని.. వచ్చే రెండు నెలలపాటు ఈ బస్సు యాత్ర జరగాలని సీఎం అన్నారు. నియోజకవర్గాల వారీగా సమావేశాలపై తేదీ, స్థలం సహా పక్కా ప్రణాళిక తయారు చేసుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం, మహిళా సాధికారిత, పేదలకు, పెత్తందార్లకు మధ్య జరుగుతున్న యుద్ధం అంశాలను ప్రస్తావిస్తూ ఈ బస్సు యాత్ర జరగాలన్నారు.
విజయవాడ పార్టీ ప్రతినిధులు సమావేశంలో ప్రకటించిన కార్యక్రమాలపై నియోజకవర్గాల స్థాయిలో అవగాహన కల్పించాలని సీఎం జగన్ అన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా జరిగే అవగాహన సమావేశంలో గృహసారథులు, సచివాలయ కన్వీనర్లు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, వాలంటీర్లు ఈ సమావేశాలకు హాజరయ్యేలా చూడాలని తెలిపారు. జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులను రీజినల్ కో-ఆర్డినేటర్లు సందర్శించాలని.. ఎమ్మెల్యేలతో కలిసి ఈ కార్యక్రమం సమర్థవంతంగా జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.