AP CM Chandrababu: ఏపీ యువతకు గ్లోబల్ స్థాయి ఉద్యోగాలు లభించేలా నైపుణ్యాభివృద్ధి పెంచాలని సీఎం చంద్రబాబు సూచించారు. పాఠశాల, ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధిపై కలెక్టర్ల సదస్సులో చర్చించారు. ఆ శాఖ కార్యదర్శులు కోన శశిధర్, సౌరభ్ గౌర్ ఈ సదస్సులో వివరించారు. విద్యాశాఖపై ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కోన శశిధర్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. బడిబాట కార్యక్రమాన్ని కోన శశిధర్ వివరించారు. ఏ స్కూల్ అయినా సరే.. పిల్లలు స్కూళ్లకు వచ్చేలా చూడాలని చంద్రబాబు పేర్కొన్నారు. పిల్లలు ఎవ్వరూ డ్రాపవుట్ కావడానికి వీలులేదని ఆయన అధికారులను ఆదేశించారు. డ్రాపవుట్లు ఉండకుండా కసరత్తు చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సదస్సులో వెల్లడించారు. అన్ని రకాల పాఠశాలలు సీబీఎస్సీ పరీక్షలకు తరహా స్థాయిలో సన్నద్దమయ్యేలా కృషి చేస్తున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు.
Read Also: Anand Mahindra : యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి చైర్‌పర్సన్‌గా ఆనంద్ మహీంద్రా
ఉన్నత విద్య, నైపుణాభివృద్ధిపై సీఎం చంద్రబాబు కలెక్టర్ల సదస్సులో ప్రస్తావించారు. గతంలో నాక్ అక్రిడేషన్‌లో ఏపీ యూనివర్సిటీలు టాప్ 10లో ఉండేవని.. ఇప్పుడు నాక్ అక్రిడేషన్‌లో ఒక్కటి కూడా లేకపోవటం శోచనీయమన్నారు. పాఠ్యాంశాలు కూడా ఎప్పటికప్పుడు మారుతూ ఉండాలి.. దానిపై కూడా ఎవరికీ ఫోకస్ లేకుండా పోయిందన్నారు. మన విద్యార్థులు గ్లోబల్ స్థాయిలో నైపుణ్యాల్ని సంపాదించుకునేలా శిక్షణ ఇవ్వాలన్నారు. అందుకు అనుగుణంగా ఉండే కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వర్చువల్ వర్కింగ్ కోసం ఓ విధానాన్ని రూపొందించాలని.. దీనిపై ఓ వర్క్ షాప్ చేయాలని సూచించారు. ఏపీ వర్చువల్ వర్కింగ్ హబ్‌గా మారాలన్నదే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.