పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంపై ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారిందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) అమరావతి విభాగం తెలిపింది. పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోందని.. రాగల 24 గంటల్లో తీవ్ర వాయుగుండగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ క్రమంలో.. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆక్రమణలు తొలగించేలా పటిష్ట చట్టం తెస్తామని అన్నారు. అంతేకాకుండా.. బుడమేరు ఆక్రమణలు తొలగిస్తామని చెప్పారు. కొంతమంది ఆక్రమణల కారణంగా లక్షల మంది ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఊరుకోమని పేర్కొన్నారు. కొల్లేరులో ఆక్రమణలు వల్ల నీరు వెనక్కి తన్నే పరిస్థితి ఉంది.. దీనిని పరిశీలించి ఆక్రమణలు కొట్టేస్తామన్నారు. రాజకీయ అండతో కొందరు విచ్చలవిడిగా చేశారు.. ప్రజా భద్రత కంటే ఈ ప్రభుత్వానికి ఏదీ ముఖ్యం కాదు ముఖ్యమంత్రి తెలిపారు. ప్రజల్లో నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ఏం చేయాలో అన్నీ చేస్తున్నాం.. 5 ఏళ్లలో డ్రైన్ లన్నీ నాశనం చేశారని దుయ్యబట్టారు. అన్నీ కూడా ఆధునికీకరిస్తాం అని చంద్రబాబు చెప్పారు.
వరద రావటానికి కారణాలు, ప్రభుత్వం తీసుకున్న సహాయక చర్యలు గవర్నర్ కు నివేదించానని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వ చర్యల పట్ల గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. త్వరలోనే సాధారణ పరిస్థితి నెలకొంటుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రలో ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉన్నందున అన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఏలేరు ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద ఉధృతిని నిశితంగా పరిశీలిస్తూ అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అలాగే.. విశాఖ, అల్లూరి జిల్లాల్లో కొండచరియలు విరిగిపడే ప్రమాదం గుర్తించి ముందస్తు హెచ్చరికలు పంపామని ముఖ్యమంత్రి తెలిపారు. మరోవైపు.. విజయవాడలో అంటు వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్యం విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని సీఎం చెప్పారు. ప్రతీ బృందాన్ని జవాబుదారీతనంగా పెట్టి పారిశుద్ధ్యం, ఆహారం పంపిణీ చేపట్టామన్నారు. గత 8 రోజుల్లో 97లక్షల మందికి పైగా సరిపడా ఆహారo పంపిణీ చేశాం.. బుడమేరు ఇన్ ఫ్లో, నగరంలో పడే వర్షపాతం, తదితర అధ్యయనాలతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామో ప్రజలు కూడా అర్ధం చేసుకోవాలి.. మరోవైపు, దెబ్బతిన్న వాహనాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు బాగు చేపించటం ఇప్పుడు పెద్ద సవాల్ గా మారింది సీఎం చెప్పారు.
కాగా.. బుడమేరు కాలువకు గండ్లు పడడంతో.. విజయవాడలోని కొన్ని ప్రాంతాల్లు అతలాకుతలం అయ్యాయి. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. వందలాది మూగజీవాలు చనిపోయాయి. దీనంతటికీ ప్రధాన కారణం బుడమేరు. సహజంగా కృష్ణానది నుంచి విజయవాడకు వరదలు వస్తాయనుకుంటారు. కానీ ఈసారి బుడమేరు బెజవాడను ముంచేసింది. సింగ్ నగర్, రామకృష్ణాపురం, నందమూరి నగర్, నున్న, వన్ టౌన్, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరింది.