Amaravati Drone Show: కృష్టా తీరంలో జరిగిన అమరావతి డ్రోన్ షో సందర్శకులను అబ్బురపరిచింది. అమరావతి డ్రోన్ షో ఐదు ప్రపంచ రికార్డులను నెలకొల్పింది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు గిన్నిస్ బుక్ ప్రతినిధులు ధ్రువపత్రాలను అందించారు. లార్జెస్ట్ ప్లానెట్ ఫార్మేషన్ పేరిట మొదటి రికార్డు సాధించగా.. లార్జెస్ట్ ల్యాండ్ మార్క్ సృష్టికి రెండో రికార్డు అందుకుంది. లార్జెస్ట్ ప్లేన్ ఫార్మేషన్ పేరిట మూడో రికార్డును డ్రోన్ షో నెలకొల్పింది. డ్రోన్ల ద్వారా అతిపెద్ద జాతీయ జెండా ప్రదర్శనతో నాలుగో రికార్డును సాధించింది. ఏరియల్ లోగోతో ఐదో రికార్డును అమరావతి డ్రోన్ షో నెలకొల్పింది. ఐదు గిన్నిస్ రికార్డులతో అమరావతి డ్రోన్ షో చరిత్ర సృష్టించింది.
Read Also: AP Disaster Management Agency: ఏపీకి మరోసారి తుపాను ముప్పు.. ఐఎండీ హెచ్చరిక
జాతీయ డ్రోన్ సమ్మిట్‌లో భాగంగా పున్నమి ఘాట్‌లో అతిపెద్ద డ్రోన్ షోను సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. కృష్ణా నది తీరంలో 5,500 డ్రోన్‌లతో భారీ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. డ్రోన్ షోతో పాటు లేజర్ షోను ఏర్పాటు చేశారు. డ్రోన్ షోను వీక్షించేలా ఐదు చోట్ల డిస్‌ప్లేలను ఏర్పాటు చేశారు. డ్రోన్ షోతోపాటు లేజర్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ప్రదర్శనను తిలకించేందుకు కృష్ణా తీరానికి భారీగా సందర్శకులు తరలివచ్చారు. కృష్ణా తీరమంతా సందర్శకులతో నిండిపోయింది. రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు ఈ డ్రోన్ షోకు హాజరయ్యారు. ఈ డ్రోన్ షోలో ఒకేసారి 5500 డ్రోన్ల లైటింగ్‌తో ఆకాశంతో వివిధ ఆకృతులను ప్రదర్శించారు. 1911 నాటి పోస్టల్ స్టాంప్ ఆకృతి కనువిందు చేసింది. కళ్లు చెదిరేలా ఆకాశంలో విమానం ఆకృతిలో వేలాది డ్రోన్లు దూసుకొచ్చాయి. ఆకాశం నుంచి ఒక్కసారిగా ఉట్టిపడినట్లు గౌతమబుద్ధుని ప్రతిమ డ్రోన్లతో దర్శనమిచ్చింది. ప్రదర్శన తిలకించేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు.
ప్రపంచ పటంపై భారత్ మ్యాప్‌తో ఆకాశంలో డ్రోన్లు విహరించాయి. వివిధ రంగాల్లో డ్రోన్ల వినియోగంపై డ్రోన్ల ఆకృతి ప్రదర్శన ఆకట్టుకుంది. అమరావతి డ్రోన్ హ్యాకథాన్ విజేతలకు సీఎం చంద్రబాబు నగదు నజరానాను అందించారు. డ్రోన్‌షోతో పాటు లేజర్ షో అందరినీ ఆకట్టుకుంది. డ్రోన్ సమ్మిట్‌లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలను సీఎం చంద్రబాబు మైమరిచిపోయి వీక్షించారు.