CM Chandrababu: ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో కూడా తెలిసిన వ్యక్తి పవన్ కల్యాణ్ అంటూ.. అసెంబ్లీ వేదికగా జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై ప్రశంసలు కురిపించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఏపీ 16వ శాసనసభాపతిగా చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా.. తొలిసారి అసెంబ్లీలో ప్రసంగించిన చంద్రబాబు.. పవన్ కల్యాణ్‌ను అసెంబ్లీ గేటు తాకనీయం అంటూ గతంలో డైలాగులు చెప్పారు.. కానీ, ఈ ఎన్నికల్లో 21 శాసనసభ స్థానాల్లో పోటీ చేస్తే 21 సీట్లలోనూ గెలిచిన సత్తా జనసేనది అని కొనియాడారు.. ఇదే సమయంలో.. వైనాట్ 175 అన్న పార్టీ 11 స్థానాలకే పరిమితం అయ్యిందన్నారు.. ఇది కాదా? దేవుడి స్క్రిప్ట్ అన్నారు.. గత సభ లాంటి సభను తాను ఈ సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదన్నారు.. ఈ సభలో హుందాతనంతో ముందుకు వెళ్లాలి.. ఇక, వెకిలితనం, వెకిలి మాటలకు స్వస్తి అన్నారు. చట్ట సభల విలువ తెలిసిన వ్యక్తి అయ్యన్న పాత్రుడు.. ఆయన నాయకత్వంలో సభ హుందాతనం పెరుగుతుందన్నారు సీఎం చంద్రబాబు నాయుడు.