తెలంగాణలోని జగిత్యాలలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా సాగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ప్రోటోకాల్ వివాదంపై ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కార్యకర్తలను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సముదయించారు. పోలీసులు కూడా ఇరు వర్గాలను చెదరగొట్టారు.
Also Read: Ramanthapur SBI: రామంతపూర్ ఎస్‌బీఐ బ్రాంచ్‌లో ఘరానా మోసం.. కోట్లు కొల్లగొట్టిన బ్యాంక్ మేనేజర్లు!
శనివారం ఉదయం జగిత్యాల స్థానిక తహసీల్దార్ కార్యాయలంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ధర్మపురి ఎమ్మెల్యే, విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, జగిత్యాల బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గత ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించడంతో.. కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన్ను మాట్లాడకుండా అడ్డుకున్నారు. దీంతో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య చిన్నపాటి వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. ఇరువర్గాలను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ శాంతింపజేశారు.