AP Judicial Academy: న్యాయాధికారుల శిక్షణ కోసం గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని కాజ వద్ద ఏర్పాటు చేసిన ఏపీ జ్యుడీషియల్ అకాడమీని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జ్యుడిషియల్ అకాడమీ ప్యాట్రన్ ఇన్ చీఫ్, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర, జ్యుడిషియల్ అకాడమీ అధ్యక్షులు, బోర్డ్ ఆఫ్ గవర్నర్లు(హైకోర్టు న్యాయమూర్తులు) తదితరులు పాల్గొన్నారు.
నూతన సాంకేతికతకు అనుగుణంగా మార్పులు చేసుకోవడం ముఖ్యమని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. న్యాయవ్యవస్థలో వేగంగా సేవలు అందించాలంటే మౌలిక వసతులను మెరుగుపరచాలన్నారు. న్యాయవ్యవస్థలో టెక్నాలజీ కూడా అంతర్భాగమైందని ఆయన వెల్లడించారు. న్యాయమూర్తులు నిత్య విద్యార్థులుగా ఉంటూ నైపుణ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కోర్టులు వివాదాల పరిష్కారమే కాదు న్యాయాన్ని నిలబెట్టేలా ఉండాలన్నారు.
President Droupadi Murmu: యాదాద్రీశుడిని సందర్శించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
కేసుల పరిష్కారంలో ఆలస్యాన్ని నివారించాలని ఆయన సూచించారు. న్యాయవ్యవస్థను పరిరక్షించడానికి అందరి సహకారం అవసరమన్నారు. పెండింగ్ కేసులు సత్వరమే పరిష్కరించాలని సీజేఐ పేర్కొన్నారు. ముఖ్యమైన కేసుల్లో త్వరగా న్యాయం జరిగేలా చూడాలన్నారు. న్యాయవ్యవస్థలో కేసుల సంఖ్య కంటే తీర్పుల్లో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని సీజేఐ స్పష్టం చేశారు.గుంటూరు జిల్లాలో 1980 మార్చి 22న నమోదైన సివిల్ కేసు ఇంకా పెండింగ్‌లో ఉందని, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం కోర్టులో 1988 సెప్టెంబర్ 19న దాఖలైన క్రిమినల్ కేసు పెండింగ్‌లో ఉందని ఈ సందర్భంగా వెల్లడించారు.1980-90ల మధ్య గుంటూరు జిల్లాలో నాలుగు సివిల్ కేసులు, ఒక క్రిమినల్ కేసు పరిష్కరిస్తే పదేళ్లు ముందుకెళ్లొచ్చన్నారు. అనంతపురం జిల్లాలో1978-88ల మధ్య 9క్రిమినల్ కేసులు, ఒక సివిల్ కేసు పరిష్కరిస్తే పదేళ్లు ముందుకు వచ్చేస్తారన్నారు. హైకోర్టులో 1976 నుంచి పెండింగ్ లో ఉన్న 138కేసులు పరిష్కరిస్తే పదేళ్లు ముందుకొస్తారన్నారు. ఇది ఏపీలోనే కాదు దేశం మొత్తం ఇలాగే ఉందని సీజేఐ అన్నారు.