వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానిపై చిలకలపూడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన విషయం తెలిసిందే. మచిలీపట్నం ఆర్ఆర్ పేట పీఎస్‌లో సీఐ ఏసుబాసుపై బెదిరింపులకు దిగారని ఆయనపై కేసు నమోదైంది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ పేర్ని నానితో పాటు 29 మందిపై కేసు నమోదు చేశారు. ఈ కేసు విషయంలో జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడును పేర్ని నాని కలిసి వివరణ ఇచ్చారు. సీఐ తనను రెచ్చగొట్టాడని, తాను కూల్‌గానే మాట్లాడానని తెలిపారు.
‘నేను సీఐపై దాడి చేయలేదు. ఆయనే లేచి నిలబడి నన్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. అయినా కూడా నేను కుర్చీలోనే కూర్చుని కూల్‌గా మాట్లాడా. నన్ను నువ్వు అట్లా అంటావా, ఇట్లా అంటావా అని మాట్లాడాడు. నన్ను నువ్ ఏం ఉరేయలేవన్నాడు. నువ్ మేకల సుబ్బన్నను కూడా ఉరేయలేవన్నాను. అతను గట్టిగానే మాట్లాడాడు, నేను కూడా గట్టిగానే మాట్లాడా. ఎస్పీ గారు.. నేను ప్రజా జీవితాల్లో పాతికేళ్లు ఉన్నాను. కావాలంటే ఇపుడున్న గుంటూరు ఐజీ గారు ఎక్కడ ఎస్పీగా చేశారు. ఆయన దగ్గరకు బోలెడన్నిసార్లు ఫిర్యాదుల కోసం వెళ్లాను. మాకు ఆయన కనబడితే అడగండి.. పేర్ని నాని ఎప్పుడైనా పోలీసుల మీద దాడి చేశాడా? అని’ అని పేర్ని నాని అన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇటీవల పేర్ని నాని ఆధ్వర్యంలో వైసీపీ నేతలు మెడికల్ కళాశాల వద్ద నిరసన చేపట్టారు. కళాశాలలో ఇప్పుడు పరీక్షలు జరుగుతున్నాయని, నిరసన తెలిపేందుకు అనుమతి లేదని పోలీసులు చెప్పారు. దాంతో వైసీపీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ ఘటనలో వందల మందిపై పోలీసులు కేసు నమోదు చేసి.. 41ఏ నోటీసులు ఇచ్చారు. విచారణకు రావాలని పోలీసులు నోటీసులలో పేర్కొన్నారు. అయితే తాము చెప్పేవరకూ పోలీసుల విచారణకు వెళ్లొద్దంటూ మేకల సుబ్బన్న సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో పోలీసులు సుబ్బన్నను అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలిసి పేర్ని నాని పెద్ద సంఖ్యలో కార్యకర్తలతో పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. సీఐ గదిలోకి వెళ్లి మాట్లాడారు. పోలీసు విధులకు ఆటంకం కలిగించిన నేపథ్యంలో పేర్ని నానిపై కేసు నమోదు చేశారు.