కల్తీ మద్యం కేసులో ఎంతటి వారైనా వదిలేది లేదు అని మంత్రి కొల్లు రవీంద్ర వార్నింగ్ ఇచ్చారు. మచిలీపట్నంలో గతంలో ప్రజాప్రతినిధులా, ఇప్పుడు వారే రౌడీలా వ్యవహరిస్తున్నారు అని మండిపడ్డారు. పోలీసు స్టేషన్‌లో అంత రాద్ధాంతం చేయాల్సిన పనేముంది?.. ప్రతీదీ కౌంట్ అవుతుంది, చట్టాలున్నాయి అని మాజీ మంత్రి పేర్ని నానిని ఉద్దేశించి అన్నారు. కొందరు ఇష్టం వచ్చినట్టు తన మీద మాట్లాడుతున్నారని.. తన వాళ్లని నేను కంట్రోల్ చేస్తున్నా అని, వదిలితే తమ వాళ్లు చాలా చేస్తారు అని పేర్కొన్నారు. డిఫమేషన్‌కు వెళుతున్నాం అని, ఎదుర్కోవడానికి వైసీపీ సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. పేర్ని నాని లిక్కర్ కేసులోనే జైలుకు వెళ్లాడని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.
‘మొలకల చెరువు కల్తీ మద్యంపై పూర్తి విచారణ జరుగుతోంది. 20 మందిలో 14 మందిని అరెస్టు చేశాం. జనార్ధన్ రావును కూడా కష్టడిలోకి తీసుకున్నాం. కల్తీ మద్యంకు లింక్‌లో ఉన్న వైన్ షాపును సీజ్ చేశాం. ఐదుగురిని అరెస్టు చేసి, 4గురుకి పీటీ వారెంట్ ఇచ్చాం. హైదరాబాద్, బెంగళూరు, మన రాష్ట్రంలో నాలుగు టీంలు పెట్టాం. ప్రతీ షాపుకు క్లియర్ ఇనస్ట్రక్షన్లు ఇచ్చాం. సెబ్ (SEB)ను కూడా ఎక్సైజ్‌లో కలిపి బలమైన ఎన్ఫోర్స్మెంట్ తెచ్చాం. APTATS యాప్ ద్వారా అన్ని వివరాలు తెలుసుకునేందుకు ఏర్పాట్లు చేశాం. ఒక మందు బాటిల్‌కు సంబంధించిన ప్రతీ అంశం ఈ యాప్‌లో దొరుకుతుంది. గూగుల్ ప్లే స్టోర్ ద్వారా అందరూ ఈ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. గతంలో పక్క రాష్ట్రం నుంచి వచ్చినవి కూడా కంట్రోల్ చేశాం. ఈఎన్ఏ మన రాష్ట్రంలో దొరికేలా చేశాం. ఇల్లిసిట్ లిక్కర్ ఎక్కడా ఉండకూడదని నవోదయ ప్రోగ్రాం చేస్తున్నాం’ అని శనివారం మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో చెప్పారు.
Also Read: Indrakeeladri: మీరే ప్రెస్‌మీట్ నిర్వహించుకోండి.. తొలిరోజే ఇంద్రకీలాద్రిపై ప్రోటోకాల్ వివాదం!
‘2019 వరకూ నడిచిన బ్రాండ్లు ఏమైపోయాయి వైఎస్ జగన్ చెప్పాలి. కొన్ని కంపెనీలు మీరు సృష్టించారు. షాపులలో ఉండే వారిని ఔట్ సోర్సింగ్ చేసి కమీషన్లు కొట్టారు. మీ నాయకులతోనే షాపులు ఇప్పించి అద్దెలు తీసుకున్నారు. సిట్ ఎంక్వైరీలో అన్ని వివరాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం నాశనం చేసారు. మా పార్టీకి చెందిన జయచంద్రా రెడ్డి ఉంటే మేం వెంటనే సస్పెండ్ చేశాం. తెనాలిలో వైసీపి బూత్ కన్వీనర్ ఈ కేసులో ఉంటే సస్పెండ్ చేయలేదు. కాకాణి, రామిరెడ్డి ప్రతాప్ లాంటి వారిపై చర్యలేవి?. నలుగురు చనిపోయారని అసత్య ప్రచారం చేశారు. ఎవరు చనిపోయినా కల్తీ మద్యంతో లింక్ చేస్తున్నారు. శవ రాజకీయాలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తే ఊరుకోం. ఒక SHO ని సస్పెండ్ చేసాం. కల్తీ లిక్కర్ లాంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూస్తాం. జనార్ధన్ రావుకి ఇబ్రహీంపట్నంలో రెండు షాపులున్నాయి. లిక్కర్ స్కామ్‌లో ప్రధాన సూత్రధారి మిథున్ రెడ్డి సీబీఐ ఎంక్వైరీ ఎలా అడుగుతారు. దొంగలే దొరల్లా మాట్లాడటం బాధాకరం. తంబళ్లపల్లెలో సెప్టెంబరు నెల నుంచే చిన్న బాటిళ్ళ ఇండెంట్ తగ్గింది. అన్ని షాపులూ మరోసారి ఎంక్వైరీ చేస్తాం. ఎక్కడైనా కల్తీ మద్యం ఉందని తేలితే ఆ షాపులు రద్దు చేస్తాం. వైసీపీ వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు’ అని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.