Christmas Wishes: క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లో సందడి నెలకొంది. ప్రభువైన ఏసు క్రీస్తును భక్తిశ్రద్ధలతో ఆరాధించేందుకు క్రైస్తవులు సంసిద్ధమవుతున్నారు. క్రిస్మస్ పండుగలో ప్రధాన పాత్ర పోషించే స్టార్లు, క్రిస్మస్ ట్రీల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. సర్వ మానవాళిని పాప విముక్తుల్ని గావించేందుకు దైవ కుమారుడైన ఏసుక్రీస్తు భూమిపై అవతరించిన డిసెంబర్ 25ను క్రిస్మస్ పండుగగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. క్రిస్మస్ పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో సందడి నెలకొంది. ఇప్పటికే చర్చిలను విద్యుత్ కాంతులతో అందంగా ముస్తాబు చేశారు. కేకులు, స్వీట్లు అమ్మకాలు ఊపందుకున్నాయి. క్రిస్మస్ పండుగలు ప్రధాన పాత్ర వహించే స్టార్లు, ట్రీలు కొనుగోలు చేసేందుకు క్రైస్తవులు ఆసక్తి చూపారు.
Read Also: Chandrababu: వచ్చే ఎన్నికలు వైసీపీ – టీడీపీ, జనసేన మధ్య జరిగే ఎన్నికలు కావు..
క్రిస్మస్ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ శుభాకాంక్షలు
క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రైస్తవ సోదర, సోదరీమణులు అందరికీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. దైవ కుమారుడు జీసస్ మానవునిగా జన్మించిన రోజును ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగగా జరుపుకుంటారని ముఖ్యమంత్రి అన్నారు. ఏసుప్రభువు జీవనం అందరికీ ఆదర్శప్రాయమని, తన బోధనల ద్వారా మానవాళిని సన్మార్గం వైపు నడిపించేలా ఏసుక్రీస్తు మార్గనిర్దేశం చేశారని పేర్కొన్నారు. నిస్సహాయులపై కరుణ, సాటివారిపై ప్రేమ, క్షమ, సహనం, దాతృత్వం, త్యాగం.. ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలని ముఖ్యమంత్రి అన్నారు.ఎల్లప్పుడూ ఆ కరుణామయుని ఆశీస్సులు, దీవెనలు ప్రజలకు ఉండాలని సీఎం జగన్ ఆకాంక్షించారు.