Chiranjeevi Dedication for Dance Practice in Early Days: 22 సెప్టెంబర్ 2024న భారతీయ చలన చిత్ర పరిశ్రమలో అత్యంత సక్సెస్ ఫుల్ చలనచిత్ర నటుడిగా, డాన్సర్ గా మెగాస్టార్ చిరంజీవి కొణిదెలని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించింది. మోస్ట్ ప్రోలిఫిక్ ఫిలిమ్ స్టార్ ఇన్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ కేటగిరీలో ఆయన పేరు గిన్నీస్ బుక్ లోకి ఎక్కింది. 1978లో మెగాస్టార్ అరంగేట్రం చేసిన రోజు కూడా సెప్టెంబర్ 22 కావడం గమనార్హం. మెగాస్టార్ చిరంజీవి 46 సంవత్సరాల కాలంలో తన 156 సినిమాల్లో 537 పాటల్లో 24000 డ్యాన్స్ మూవ్స్ చేసినట్టు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో నమోదయింది. అయితే ఇది అంతా సాధారణంగా జరిగిన విషయం అయితే కాదు. ఎక్కడో మొగల్తూరులో తన తల్లి స్వగృహంలో జన్మించిన కొణిదెల శివశంకర వరప్రసాద్ అనే యువకుడు సినిమా మీద మక్కువ పెంచుకున్నాడు. అలా అని చదువు అశ్రద్ధ చేయలేదు, డిగ్రీ పట్టా పుచ్చుకొని ఉద్యోగ వేటలో పడకుండా ఎక్సైజ్ శాఖలో పనిచేసే తన తండ్రి వెంకట్ రావు అనుమతితో చెన్నైలో ఫిలిమ్ ఇన్స్టిట్యూట్లో చేరారు.
అలా సినీ ప్రయాణం మొదలుపెట్టిన ఆయన ఈరోజు మెగాస్టార్ చిరంజీవిగా అశేష తెలుగు ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్నారు. నిజానికి మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో నటించడం మొదలుపెట్టినప్పటి నుంచే ఆయన డాన్స్ గురించి కూడా ప్రత్యేకంగా చర్చలు జరిగేవి. ఎందుకంటే అప్పటికి ముందు తరం అంటే ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి నటీనటుల పీరియడ్ లో డాన్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు కాదు. వీరిలో కొంతవరకు ఏఎన్ఆర్ కృష్ణ తమదైన శైలిలో డాన్స్ చేసేందుకు ప్రయత్నించేవారు. కానీ మెగాస్టార్ చిరంజీవి లాగా అన్ని రకాల డాన్స్లను పెర్ఫామ్ చేసే అవకాశాలు వారికి రాలేదని చెప్పచ్చు. కానీ మెగాస్టార్ చిరంజీవి మాత్రం తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తూ వచ్చాడు. చిరు వేసే డ్యాన్సులకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. డ్యాన్సులకు చిరంజీవి అడ్రస్‌లాంటి వారని చెప్పాల్సిన పని లేదు. తెలుగు రాష్ట్రాల్లో డ్యాన్స్ అంతగా ఫేమస్ అవ్వడానికి 80, 90లలో చిరు చూపించిన గ్రేస్, వేసిన స్టెప్పులే కారణం. ఇప్పటి తరం సైతం చిరు గ్రేస్, స్టైల్‌ను మ్యాచ్ లేకపోతోంది అంటే ఆయన స్టైల్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు.
అయితే ఆయన తన డాన్స్ ని ఎంత పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేస్తాడో దాని కోసం ఎంత కష్టపడతారో తెలిపేందుకు ఒక ఉదాహరణ ఉంది. అప్పటికే ఆయన కొన్ని సినిమాలు చేశారు. కృష్ణతో కలిసి రెండు సినిమాలు చేశారు. కృష్ణ మూడోసారి తోడుదొంగలు అనే సినిమాలో అవకాశం ఇచ్చారు. ఆ సినిమాలో కృష్ణతో కలిసి మెగాస్టార్ చిరంజీవి డాన్స్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే అప్పటికే కృష్ణ బాగా డాన్స్ చేస్తారని పేరు ఉంది. రేపు ఉదయం కృష్ణ -చిరంజీవి కాంబినేషన్లో సాంగ్ షూటింగ్ చేయాల్సి ఉందనగా చిరంజీవి అప్పటి ప్రముఖ పాత్రికేయుడు తర్వాత కాలంలో పిఆర్ఓగా ఎన్నో సంచలన చిత్రాలకు పని చేసిన ఒక సీనియర్ జర్నలిస్ట్ స్నేహితుడితో తన మనసులో మాట బయటపెట్టారు. అదేంటంటే కృష్ణ గారు బాగా డాన్స్ చేస్తారు నేను ఆయన పక్కన బాగా డాన్స్ చేయకపోతే ఆయన నన్ను సిఫారసు చేసినందుకు మాట వచ్చేస్తుంది. అలా రాకుండా ఉండాలంటే ఆ పాట క్యాసెట్ తెచ్చి పెట్టినట్టయితే నేను ప్రాక్టీస్ చేసి పర్ఫెక్ట్ గా చేసే అవకాశం ఉంటుందని చెప్పారట. సదరు పాత్రికేయులు కూడా తనకున్న పరిధి మేరకు ఆ క్యాసెట్ సంపాదించి మెగాస్టార్ చిరంజీవికి అందించారట.
ఆ రాత్రంతా మెగాస్టార్ చిరంజీవి నిద్రపోకుండా ఆ డాన్స్ కి ప్రాక్టీస్ చేసి ఉదయాన్నే సూపర్ స్టార్ కృష్ణతో కలిసి స్టెప్పులేసి భళా అనిపించారట.. ఇప్పుడు వినడానికి చాలా సాధారణంగానే అనిపిస్తుంది కానీ ఆ రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి తన డాన్స్ కోసం ఎంత కష్టపడేవారో ఈ ఒక్క ఉదాహరణ తేటతెల్లం చేస్తుంది. ఇలాంటి ఘటనలు ఇంకా ఎన్నో. నిజానికి ఆయనకు తన డాన్స్ లో ఒక రకమైన ఈజ్ ఉంది. కానీ పక్కనే సూపర్ స్టార్ కృష్ణ తో డాన్స్ చేయాల్సి వచ్చినప్పుడు దాన్ని ఆయన డాన్స్ తో మెర్జ్ చేసేలా చేయడం కోసం ఒక రాత్రంతా ప్రాక్టీస్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అంతలా కష్టపడ్డారు కాబట్టే ఈరోజు తెలుగు ప్రజలందరూ అన్నయ్య అని ఆరాధించే స్థాయికి ఎదిగారు. కాబట్టి కలలు కనడం మాత్రమే కాదు ఆ కలలను సాకారం చేసుకోవాలంటే దానికి తగ్గట్టు కూడా కష్టపడాలి. అంత కష్టపడ్డారు కాబట్టే ఎక్కడో మొగల్తూరులో జన్మించిన శివశంకర వరప్రసాద్ ఈరోజు తెలుగు ప్రేక్షకులందరూ మావాడు, మా అన్నయ్య అని చెప్పుకునే స్థాయికి ఎదిగారు. ఆయన మాత్రమే కాదు ఆయన కుటుంబం నుంచి ఎందరో హీరోలు వచ్చి ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమ సత్తాను మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఆయనకు అందని అవార్డులు లేవు దక్కని రివార్డులు లేవు. ఇప్పుడు ఆయన పోర్ట్ఫోలియోలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ గా కూడా మరో కలికితురాయి వచ్చి చేరింది. కంగ్రాట్స్ మెగాస్టార్ చిరంజీవి..