Chinta Mohan: చంద్రబాబు అరెస్టులో రాజకీయ కక్ష ఉంది.. చంద్రబాబునాయుడు అమాయకుడు.. చంద్రబాబు ఏ తప్పు చేయలేదని నేను నమ్ముతున్నా.. ప్రజలు కూడా నమ్ముతున్నారని తెలిపారు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చింతామోహన్.. ప్రతిపక్ష నేత చంద్రబాబు అరెస్టు దుర్మార్గమైన చర్యగా అభివర్ణించిన ఆయన.. న్యాయస్థానాలపై ప్రజలకు విశ్వాసం తగ్గుతోందన్నారు. చంద్రబాబు కేసులో రుజువులు ఎక్కడ ఉన్నాయి.. చూపించండి..? అని నిలదీశారు. చంద్రబాబు అరెస్టులో బీజేపీ ఢిల్లీ పెద్దల పాత్ర ఉందని ఆరోపణలు గుప్పించారు. చంద్రబాబు అరెస్టుపై ప్రజాస్వామ్యవాదులు నోరు విప్పాలని పిలుపునిచ్చారు.
Read Also: CM KCR: గజ్వేల్ బీఆర్ఎస్ నాయకులతో సీఎం కేసీఆర్ భేటీ.. అదే కారణమా..?
న్యాయస్థానాలపై నమ్మకం కోల్పోతున్న పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్పందించాలని డిమాండ్ చేశారు చింతామోహన్.. న్యాయస్థానాల్లో రాజకీయ ప్రమేయంపై సుప్రీంకోర్టు సీజే సమాధానం చెప్పాలన్నారు. ఇక, పాత పెన్షన్ విధానాన్ని ఆంధ్రప్రదేశ్ లో అమలు చేయాలని కోరారు.. ఇండియన్ పొలిటికల్ సర్వీసా.. ఇండియన్ పోలీస్ సర్వీసా…? అంటూ పోలీస్ వ్యవస్థపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. పాలస్తీనాలోని గజి ప్రాంతంలో జరిగిన బాంబు దాడిలో 500 మంది మరణించడం బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు.. బాంబు దాడులకు కారణమైన అమెరికా, ఇజ్రాయెల్ దేశాలను ప్రధాని నరేంద్ర మోడీ పొగడటం దారుణం అన్నారు. త్వరలో జరుగనున్న నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయం అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చింతామోహన్.