18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఐపీఎల్ టైటిల్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు కర్ణాటక ప్రభుత్వం బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో బుధవారం (జూన్ 4) భారీ సన్మానం ఏర్పాటు చేసింది. ఆర్సీబీ విజయోత్సవంలో తమ ఆరాధ్య క్రికెటర్లను చూసేందుకు అభిమానులు లక్షలాది సంఖ్యలో స్టేడియంకు పోటెత్తడంతో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోగా.. మరో 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ తొక్కిసలాటకు పలు కారణాలు కన్పిస్తున్నాయి.
బస్ పరేడ్ రద్దు:
బెంగళూరులోని విధాన సౌద నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు ఓపెన్ బస్ పరేడ్ ఉంటుందని ఆర్సీబీ ప్రకటించింది. దాంతో తమ అభిమాన ఆటగాళ్లను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో పోటెత్తారు. వర్షం పడటంతో ఆర్సీబీ ఓపెన్ బస్ పరేడ్‌ను రద్దు చేశారు. దాంతో అభిమానులు అయోమయానికి గురయ్యారు. ఎలాగైనా తన అభిమాన ఆటగాళ్లను చూసేందుకు చిన్నస్వామి స్టేడియానికి బయల్దేరారు. అప్పటికే అక్కడ లక్షలాది మంది ఉన్నారు. దాంతో చిన్నస్వామి స్టేడియం వద్ద ఎర్ర సముద్రంగా మారింది.
ఫ్రీ టికెట్స్ ప్రచారం:
చిన్నస్వామి స్టేడియం కెపాసిటీ 35 వేలు. కానీ అక్కడికి దాదాపు 3 లక్షల మంది అభిమానులు చేరుకున్నారు. స్టేడియంకు మొత్తం 13 గేట్లు ఉండగా.. 9, 10వ గేట్లను బెంగళూరు క్రికెట్ అసోసియేషన్ సభ్యులకు రిజర్వ్ చేశారు. 5, 6, 7 గేట్ల నుంచి అభిమానులకు ఎంట్రీని కల్పించారు. 7వ నంబర్ గేట్ నుంచి మెయిన్ ఎంట్రెన్స్ నుంచే వచ్చే వ్యూ బాగా కన్పిస్తుంది. మెయిన్ ఎంట్రెన్స్ నుంచి ఆర్సీబీ టీమ్ మైదానంలోకి వస్తుందని తెలుకుని.. 7వ నంబర్ గేట్ వద్దకు అభిమానులు పోటెత్తారు. పాస్‌లు ఉన్న వారికే స్టేడియం లోపలికి వెళ్లేందుకు అనుమతి ఉండగా.. అపుడే ఫ్రీ టికెట్స్ ప్రచారం జరిగింది. ఫ్రీ టికెట్స్ తీసుకునేందుకు అభిమానులు పరుగులు తీశారు. టికెట్ల కోసం ఒకరినొకరు తోసుకోవడంతో తొక్కిసలాట జరిగింది.
Also Read: RCB Stampede: నా కొడుకు శరీరాన్ని ముక్కలు చేయొద్దు.. ప్రభుత్వాన్ని వేడుకున్న తండ్రి!
చేతులెత్తేసిన పోలీసులు:
ఆర్సీబీ బస్ పరేడ్ కోసం పోలీసు అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చిన్నస్వామి స్టేడియంకు వస్తున్న సీఎం సిద్దరామయ్యతో పాటు ఇతర ప్రభుత్వ పెద్దలకు బందోబస్తును అరేంజ్ చేశారు. దాంతో స్టేడియం వద్ద 5 వేల మంది పోలీసులు మాత్రమే ఉన్నారు. అంచనాలకు మించి అభిమానులు స్టేడియం వద్దకు రావడంతో వారిని నియంత్రించడం పోలీసుల వల్ల కాలేదు. స్టేడియం గేట్లు కూడా చిన్నవిగా ఉండటంతో ఫ్యాన్స్ త్వరగా లోపలికి వెళ్లేందుకు లేకుండా పోయింది. కొందరు గేట్స్, గొడలు ఎక్కి స్టేడియంలోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. అదే సమయంలో వర్షం పడడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది.