China: ఆన్‌లైన్‌లో లోదుస్తుల ప్రకటనల్లో మహిళలను నిషేధిస్తూ చైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆన్‌లైన్ వ్యాపార నిర్వాహకులు మరో మార్గాన్ని ఎంచుకున్నారు. మహిళల స్థానంలో పురుష మోడళ్లను ఉంచి ప్రకటనలు చేస్తున్నారు. లోదుస్తుల ప్రకటనల్లో అమ్మాయిలు కనిపించడం వల్ల అశ్లీలత పెచ్చుమీరుతోందన్న కారణంతో చైనా ప్రభుత్వం ఆయా ప్రకటనల్లో అమ్మాయిలు కనిపించకుండా నిషేధం విధించింది. అంతేకాదు, ఆన్‌లైన్ ప్రచారాలకు మహిళలను ఉపయోగించకుండా ఓ చట్టాన్ని కూడా తీసుకొచ్చింది. దీంతో లోదుస్తుల ప్రచారం ఎలా చేయాలో తెలియక దిగాలు పడిపోయి నష్టాలు మూటగట్టుకున్న ఆన్‌లైన్ వ్యాపార సంస్థలు తాజాగా కొత్త పంథాను ఎంచుకున్నాయి. ప్రచార వీడియోల్లో అమ్మాయిలకు బదులు అబ్బాయిలకు లోదుస్తులు ధరింపజేసి చిత్రీకరిస్తున్నారు.
Read Also: Young Professionals Scheme: ఇండియా, యూకే గ్రాడ్యుయేట్ల కోసం యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్.. అర్హతలు ఇవే..
ఇది మంచి ఫలితాలను ఇవ్వడంతో మిగతావారు కూడా ఇదే మార్గాన్ని అనుసరిస్తున్నారు. అమ్మాయిల లోదుస్తులు వేసుకున్న పురుష మోడల్స్ వీడియోలు ప్రస్తుతం అక్కడి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలపై ప్రపంచవ్యాప్తంగా కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. షేక్‌స్పియర్ కాలంలోనూ ఇలాగే ఉండేదని, అప్పట్లో వాణిజ్య ప్రకటనల్లో నటించేందుకు మహిళలకు అనుమతి లేదని కొందరంటే.. అప్పట్లో స్త్రీ పాత్రలను పురుషులు ధరించేవారని మరో యూజర్ రాసుకొచ్చాడు. ‘ఆ దుస్తులు అమ్మాయిల కంటే.. అబ్బాయిలు వేసుకుంటేనే బాగుంది కదా’ అని మరో యూజర్ కామెంట్ చేశాడు.