కేబినెట్ మీటింగ్ లో మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేల ప్రవర్తన కారణంగా ఇన్నాళ్లు నిర్మించుకున్న మంచిపేరు దెబ్బతింటోందని సీఎం తెలిపారు. మీడియా నిండా వాళ్లు చేసిన పొరపాట్లను ప్రస్తావిస్తూ వార్తలు వస్తున్నాయన్నారు. దీని వల్ల అందరికి చెడ్డ పేరు వస్తోందని చెప్పారు. మంత్రులు కూడా జాగ్రత్తగా ఉండాలని.. జిల్లాలోని ఎమ్మెల్యేలు, నాయకులను మంత్రులే గైడ్ చేయాలని సూచించారు. ఇకపై ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మంత్రులది, ఎమ్మెల్యేలదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
Read Also: Vikram: బ్లాక్ బస్టర్ తంగలాన్.. టీం అందరికీ స్వయంగా బిర్యానీ వడ్డించిన విక్రమ్
రివర్స్ టెండరింగ్ విధానంపై కీలక చర్చ
మరోవైపు.. రివర్స్ టెండరింగ్ విధానంపై కీలక చర్చ జరిగింది. గత ప్రభుత్వం మాయ చేయడానికే రివర్స్ టెండరింగ్ విధానం ప్రవేశపెట్టిందని కేబినెట్ అభిప్రాయపడింది. గత ప్రభుత్వంలో సుమారు 40 ప్రాజెక్టులకు సింగిల్ టెండర్ పడిందని.. ఇంకేం రివర్స్ టెండరింగ్ విధానం అంటూ కేబినెట్లో చర్చ జరిగింది. సీవీసీ గైడ్ లైన్స్ ప్రకారం టెండర్ల ప్రక్రియ జరిపించాలని సూచించారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన జుడిషియరీ ప్రివ్యూను కూడా రద్దు చేయాలని కేబినెట్ భావించింది. తాను చేసిన తప్పులకు ఓ జడ్జీతో ఆమోద ముద్ర వేసేలా జుడిషియరీ ప్రివ్యూ వ్యవస్థను జగన్ ఏర్పాటు చేశారని పలువురు మంత్రులు తెలిపారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో జుడిషియరీ ప్రివ్యూను రద్దు చేసేలా చూడాలని కోరారు.
ఉచిత ఇసుక పాలసీ అమలుపై చర్చ
అలాగే.. ఉచిత ఇసుక పాలసీ అమలుపై కేబినెట్లో చర్చించారు. ఇప్పుడిప్పుడే ఇసుక పాలసీ స్ట్రీమ్ లైన్లో పడుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. టైమింగ్స్ లేకుండా డే అండ్ నైట్ ఇసుక సరఫరాకి అవకాశం కల్పిస్తే స్టాక్ పాయింట్ల వద్ద లారీల రద్దీ తగ్గుతుందని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పట్టా భూముల్లోనూ ఇసుక తవ్వకాలకు అనుమతివ్వాలని సూత్రప్రాయంగా కేబినెట్ అంగీకారం తెలపింది.
రేషన్ బియ్యం డెలివరీ వాహనాల రద్దుపై చర్చ
సార్టెక్స్ బియ్యం సరఫరాను నిలిపిస్తే విమర్శలు వస్తాయేమోనని పలువురు మంత్రులు సూచించారు. మరింత అధ్యయనం చేసి సార్టెక్స్ బియ్యం పంపిణీపై నిర్ణయం తీసుకోవాలని కేబినెట్ భావించింది. ఈ క్రమంలో.. రేషన్ బియ్యం డెలివరీ వాహనాలను రద్దు చేయాలనే నిర్ణయంపై కేబినెట్లో చర్చించారు. వాహనాలకు బ్యాంక్ లింకేజీ ఉన్నట్టు అధికారులు చెప్పారు. రేషన్ బియ్యం డెలివరీ వాహనాల వల్ల ఎలాంటి ఉపయోగం లేదని మంత్రి పయ్యావుల పేర్కొన్నారు. బ్యాంక్ లింకేజీ ఉన్నందున్న ఎదురయ్యే సాంకేతిక ఇబ్బందులు.. వాటిని ఏ విధంగా వినియోగించుకోవాలనే అంశంపై మరింత చర్చించి నిర్ణయం తీసుకుందామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అలాగే.. ఫ్రీ హోల్డులోకి వెళ్లిన భూముల్లో ఎక్కువగా 5 వేల ఎకరాల మేర రిజిస్ట్రేషన్లు సత్యసాయి జిల్లాలోనే జరిగాయని అధికారులు తెలిపారు. ఫ్రీ హోల్డ్ భూముల్లో జరిగిన ప్రతి రిజిస్ట్రేషన్ను డీటైల్డుగా విచారణ చేపట్టాలని సీఎం చంద్రబాబు చెప్పారు.