Sheikh Hasina Investigation: బంగ్లాదేశ్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ దేశంలో 16 నెలల తిరుగుబాటు తర్వాత తాజాగా మరోసారి ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది. ఆగస్టు 5, 2024న బంగ్లా మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా దేశం విడిచి భారతదేశానికి ప్రవాసానికి వచ్చారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్‌లో ఆమెపై అనేక తీవ్రమైన అభియోగాలు మోపబడ్డాయి, ఇప్పటికే దేశంలో వాటిపై విచారణ కొనసాగుతోంది. తాజాగా బంగ్లాదేశ్ కోర్టు షేక్ హసీనాను అన్ని నేరాలలోనూ దోషిగా నిర్ధారించి ఆమెకు మరణశిక్ష విధించింది. గత ఏడాది బంగ్లాదేశ్‌లో చెలరేగిన హింస తర్వాత షేక్ హసీనా అనేక మంది విద్యార్థుల హత్యలకు కుట్ర పన్నారని ఆరోపణలు వచ్చాయి. మే 12న కోర్టుకు సమర్పించిన నివేదికలో షేక్ హసీనా నిరసనకారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించిందని పేర్కొంది. ఇప్పుడు కోర్టు ఈ ఆరోపణలన్నీ నిజమని తేల్చింది. ఇంతకు ఈ మాజీ ప్రధాని మరణశిక్షకు దారితీసిన ఆరోపణలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Kakinada: భార్య పిల్లలను హత్య చేసిన కేసులో ఊరట.. 23 ఏళ్ల తర్వాత బెయిల్
షేక్ హసీనాపై ఉన్న ప్రధాన ఆరోపణలు..
* బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనాపై అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ICT)లో అభియోగాలు నమోదు చేశారు. మొదటిది ప్రతిపక్ష నాయకుల బలవంతపు అదృశ్యం. రెండవది హింసాకాండ సమయంలో జరిగిన హత్యలలో షేక్ హసీనా ప్రమేయం ఉందనే ఆరోపణలు. మే 12, 2025న విడుదలైన దర్యాప్తు నివేదికల ప్రకారం.. షేక్ హసీనా హత్యలకు ఆదేశించారని, ఇది హింసకు మరింత ఆజ్యం పోసిందని ఈ నివేదికలు పేర్కొన్నాయి. ఈ సమయంలో మహిళలు, పిల్లలు సహా దేశంలో 1,400 మంది మరణించారు, దాదాపు 25 వేల మంది గాయపడ్డారని వెల్లడించాయి.
* బేగం రోకియా విశ్వవిద్యాలయ విద్యార్థి అబూ సయీద్‌ను ఎటువంటి కారణం లేకుండా హత్య చేసినట్లు షేక్ హసీనా, నిందితులు అసదుజ్జమాన్ ఖాన్ కమల్, చౌదరి అబ్దుల్లా అలీపై అభియోగాలు మోపారు. ఢాకాలోని చంఖర్ బ్రిడ్జి వద్ద ఆరుగురిని చంపినట్లు కూడా మాజీ ప్రధానిపై ఆరోపణలు ఉన్నాయి. షేక్ హసీనాపై ఉన్న ఐదు అభియోగాల్లో 13 మందిని హత్య చేయడం కూడా ఉందని చీఫ్ ప్రాసిక్యూటర్ తాజుల్ ఇస్లాం వెల్లడించారు. ఢాకా నుంచి బయలుదేరే ముందు అషులియాలో ఐదుగురిని కాల్చి చంపి, వారి మృతదేహాలను దహనం చేశారని, ఒక వ్యక్తిని సజీవ దహనం చేశారనే అభియోగాలు ఈ మాజీ ప్రధానిపై నమోదు అయ్యాయి.
బంగ్లాదేశ్‌లో మళ్లీ చెలరేగిన హింస..
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో అనేక చోట్ల అవామీ లీగ్ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వచ్చారు. ఈ సందర్భంగా వాళ్లు దేశవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు, భద్రతా దళాలు అప్రమత్తం అయ్యాయి. నిన్న రాత్రి ఢాకాలో అనేక దహనాలు, కాక్‌టెయిల్ పేలుళ్లు, బస్సు కాల్పులు, టార్చిలైట్ ఊరేగింపులు జరిగాయి. వీటి కారణంగా అనేక మంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పరిస్థితిని నియంత్రించడానికి ఢాకా మెట్రోపాలిటన్ పోలీస్ (DMP) కమిషనర్ షేక్ మొహమ్మద్ సజ్జాద్ అలీ హింసలో పాల్గొన్న వారిని వెంటనే కాల్చివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం రాత్రి 9 గంటలకు సెంట్రల్ రోడ్‌లోని మంత్రి సలహాదారు సయ్యదా రిజ్వానా హసన్ ఇంటి ముందు రెండు కాక్‌టెయిల్ పేలుళ్లు చోటుచేసుకున్నాయి. రాత్రి 9:30 గంటలకు బంగ్లా మోటార్ ప్రాంతంలో ఒక కాక్‌టెయిల్ పేలుడు జరిగింది. ఆ తర్వాత ఢాకాలోని టిటుమిర్ కళాశాల, అమ్తాలి స్క్వేర్ ముందు రెండు పేలుళ్లు సంభవించాయి. ఈ సంఘటనలో ఒక బస్సు దగ్ధమైంది.
READ ALSO: Prashant Kishor: బీహార్ ఎన్నికల్లో పీకే ఎఫెక్ట్.. ఏ పార్టీకి షాక్, ఏ పార్టీకి జాక్‌పాట్!