Chandragiri: కొత్త శానంబట్ల గ్రామంలో తలెత్తిన మంటల మిస్టరీ వీడింది. ఎప్పుడు ఎక్కడ మంటలు మండుకుంటాయోనని భయభ్రాంతులతో బిక్కుబిక్కుమంటూ అక్కడివారు గడిపారు. చంద్రగిరి మండలంలోని శానంభట్ల గ్రామం తిరుపతికి దాదాపు 15 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. ఉన్నట్లుండి అక్కడ మంటలు వ్యాపించడం అధికార యంత్రాంగానికి అంతుపట్టని సమస్యగా మారిపోయింది. గత రెండు వారాలుగా ఇది వారికి సవాలుగా మారింది. ఏకంగా జిల్లా యంత్రాంగమంతా దృష్టి సారించేంత పెద్ద సమస్యగా మారింది. కలెక్టర్ తో పాటు ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జిల్లా యంత్రాంగం మొత్తం అక్కడ పర్యటించారు. పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. అంతే కాదు గ్రామంలో మంత్రగాళ్ళ హడావుడి గంగమ్మను శాంతింపజేసేందుకు పొంగళ్ళు, పూజలు కూడా చేశారు. గడ్డివాములు తగలబడడం, హఠాత్తుగా బీరువాలో మంటలు చెలరేగడంతో అధికారులు తలలు పట్టుకున్నారు. అయితే ఈ కేసును చంద్రగిరి పోలీసులు ఛేదించారు.
Read Also:Large Explosion : అమెరికాలోని పెంటగావ్ సమీపంలో భారీ పేలుడు
శానంభట్ల ఘటనపై ముత్యాలరెడ్డిపల్లి పోలీస్ స్టేషన్లో సోమవారం ఏఎస్పీ వెంకట రావు మీడియాతో వివరాలు వెల్లడించారు. కొందరు ఆకతాయిలు ఊరిలోని ఓ గడ్డివాముకు మొదట నిప్పు పెట్టారు. ఇదే అదునుగా భావించిన కీర్తి అనే మహిళ బంధువులపై విద్వేషంతో తొలుత ఎదురింట్లో గడ్డివాముకు నిప్పు పెట్టింది. ఆ తర్వాత కీర్తి వరుసగా తన బంధువుల ఇళ్లలో బీరువాలకు, బట్టలకు నిప్పు పెట్టినట్లు గుర్తించారు. దీంతో ఊరిలో ఏదో జరిగిపోతోంది అంటూ ప్రచారం జరిగింది. గడ్డివాముకు నిప్పంటుకున్న ఘటనను అదునుగా చేసుకొని మరో గడ్డువాముకి నిప్పంటించిందని చెప్పారు. తల్లి ప్రవర్తన మార్పుకోసం వరుసగా ఇలాంటి పనులు చేసిందన్నారు. 12 వరుస అగ్నిప్రమాదాలపై ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామన్నారు. అగ్నిప్రమాదాల్లో ఎలాంటి రసాయనాన్ని వినియోగించలేదని, ఇందులో ఎలాంటి తాంత్రిక శక్తి యాంత్రిక శక్తులు వినియోగించలేదని చెప్పారు. వరుస అగ్ని ప్రమాదాలు జరిగితే తల్లితో కలిసి ఊరు వదిలి వెళ్లే అవకాశముంటుందని ఇలా చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. మొత్తం 12 అగ్నిప్రమాద ఘటనలకు పాల్పడింది. మంటల కోసం ఎలాంటి రసాయనాలు వాడలేదని, అగ్గిపెట్టెతోనే నిప్పు పెట్టిందని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం కీర్తి పోలీసుల అదుపులో ఉంది. అయితే, ఈ అగ్నిప్రమాదాల వల్ల నష్టపోయివారికి కొందరు ఆర్థిక సాయం అందించడం చూసి.. పలువరు అత్యాశతో కావాలనే తమ ఇళ్లలో నిప్పు పెట్టుకున్నారు. ఇలా గ్రామ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన వారిని అదుపులోకి తీసుకున్నారు.
Read Also:CM KCR : జేపీఎస్ సర్వీసును క్రమబద్ధీకరణపై కసరత్తు