Chandrababu Naidu: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తోన్న కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం.. ఆ పార్టీ కంచు కోటగా భావిస్తారు.. సుదీర్ఘ కాలంగా అక్కడి నుంచే ప్రాతినిథ్యం వహిస్తున్నారు చంద్రబాబు.. అయితే, గత ఎన్నికల్లో టీడీపీ మెజార్టీ తగ్గింది.. ఇక, అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఆ నియోజకవర్గంపై ఫోకస్ పెట్టి మరి పనిచేస్తోంది.. 175కి 175 స్థానాల్లో విజయం లక్ష్యంగా పెట్టుకున్న వైసీపీ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంది.. ఇక, ఎన్నికలకు కూడా పెద్దగా సమయం లేకపోవడంతో.. చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు.. కుప్పం టీడీపీ వ్యవహారాలను ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కు అప్పగించారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల నియోజకవర్గం నుంచి సంచలన విజయం సాధించారు కంచర్ల శ్రీకాంత్.. 38 మంది పార్టీ సభ్యులతో ఏర్పాటైన కుప్పం నియోజకవర్గ ఎన్నికల కమిటీకి చైర్మన్‌గా కంచర్ల శ్రీకాంత్‌ను నియమించారు. ఇక, కుప్పంలో చంద్రబాబు నాయుడుకు లక్ష ఓట్ల మెజార్టీ సాధించే లక్ష్యంతో కమిటీ ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ. ప్రస్తుతం కుప్పంలో పర్యటిస్తున్న కంచర్ల శ్రీకాంత్.. వారంలో మూడు రోజులు పాటు కుప్పంలోనే స్టే చేస్తున్నారు.
తాజాగా, మరోసారి కుప్పంలో పర్యటించిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్.. ఇటీవల జరిగిన ఘర్షణలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ కార్యకర్తలను పరామర్శించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుప్పంలో పోలీసులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు.. వైసీపీ కార్యకర్తల్లాగా పని చేస్తున్నారన్న అనుమానం వ్యక్తం అవుతోందన్నారు. కుప్పంలో ప్రజాస్వామ్యం ఉందా అన్న అనుమానం కలుగుతోందన్న ఆయన.. మా పార్టీ కార్యకర్తలపై దాడులు చేసి, అక్రమ కేసులు బనాయిస్తున్న ఏ ఒక్క పోలీసును వదిలిపెట్టబోం.. అందరిపై ప్రైవేటు కేసులు బుక్ చేస్తాం అంటూ వార్నింగ్ ఇచ్చారు.
ఇక, ఒక ఎస్సై మా కార్యకర్తకు ఫోన్ చేసి ఎన్‌కౌంటర్ చేస్తానంటూ బెదిరించడం అత్యంత దారుణమైన విషయమని మండిపడ్డారు శ్రీకాంత్.. అంగన్‌వాడీ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా కోడిగుడ్డు గొంతులో ఇరుక్కుని పసిపాప చనిపోతే ప్రభుత్వం పట్టించుకోలేదన్న ఆయన… రూ. 8 లక్షల పరిహారం ఇవ్వాలని మానవ హక్కుల కమిషన్ ఆదేశిస్తే ప్రభుత్వం దానిని సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్లి చివాట్లు తిందంటూ ఎద్దేవా చేశారు.. కోర్టు నుంచి మొటికాయలు తినడం వీరికి అలవాటుగా మారిందంటూ వైసీపీ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్. కాగా, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా తన సొంత నియోజకవర్గంలో ఎక్కువసార్లే పర్యటిస్తున్నారు.. గతంలో కంటే.. ఇప్పుడు మరింత ఫోకస్ పెట్టి పనిచేస్తున్నారు.. అందులో భాగంగానే ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌కు బాధ్యతలు అప్పగించినట్టుగా తెలుస్తోంది.