Champions Trophy 2025: పీసీబీకి మరో తలనొప్పి.. తొలగించడం లేదంటూ వివరణ!

  • ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ
  • ఫిబ్రవరి 7న గడాఫీ స్టేడియం పునఃప్రారంభం
  • పీసీబీకి మరో తలనొప్పి
Pakistan Captain Pcb

Pakistan Captain Pcb

ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆరంభం కానుంది. ఈ టోర్నీ కోసం పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డు (పీసీబీ) సర్వం సిద్ధం చేస్తోంది. ట్రోఫీ ఏర్పాట్లలో బిజీగా ఉన్న పీసీబీకి మరో తలనొప్పి వచ్చింది. పాకిస్థాన్‌కు వన్డే ప్రపంచకప్‌ అందించిన మాజీ కెప్టెన్, మాజీ పీఎం ఇమ్రాన్ ఖాన్‌ పేరును గడాఫీ స్టేడియం నుంచి తొలగిస్తారనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. ఈ వార్తలపై పీసీబీ వర్గాలు స్పందించాయి. ఎవరి పేర్లను తొలగించడం గాని, మార్చడం గాని చేయడం లేదని పేర్కొన్నాయి.

ఇమ్రాన్‌ ఖాన్ సారథ్యంలోని పాకిస్థాన్‌ టీమ్ 1992లో ప్రపంచకప్‌ను గెలిచింది. ఇందుకు గుర్తుగా లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో ఇమ్రాన్‌ పేరుతో ఓ స్టాండ్‌ను పీసీబీ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న ఇమ్రాన్‌.. జైలు జీవితం గడుపుతున్నారు. ఫిబ్రవరి 7న గడాఫీ స్టేడియాన్ని ప్రధాని షాబాజ్‌ షరీఫ్‌ పునఃప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో స్టేడియంలో ఇమ్రాన్‌ పేరును తొలగిస్తున్నారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ న్యూస్ పీసీబీ వద్దకు చేరగా.. తాజాగా బోర్డు వర్గాలు వివరణ ఇచ్చాయి. ఇటీవల గడాఫీ స్టేడియాన్ని పీసీబీ ఆధునీకరణ చేసింది.

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మ్యాచ్‌లు హైబ్రిడ్‌ మోడల్‌లో జరగనున్నాయి. దాయాది దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్ ఆడే మ్యాచులు దుబాయ్‌లో జరుగుతాయి. గ్రూప్‌ Aలో భారత్‌.. పాకిస్థాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్తో మ్యాచ్‌లు ఆడనుంది. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో, ఫిబ్రవరి 23న పాకిస్థాన్‌తో, మార్చి 2న న్యూజిలాండ్‌తో రోహిత్ సేన తలపడనుంది. చివరిసారిగా 2013లో ఎంఎస్ ధోనీ నాయకత్వంలో టీమిండియా విజేతగా నిలిచింది.