దుబాయ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో భారత్ గెలిచిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్‌పై 4 వికెట్ల తేడాతో గెలిచి విజేతగా నిలిచింది. భారత్ ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకోవడంలో స్పిన్నర్లు కీలక పాత్ర పోషించారు. దుబాయ్ పిచ్ స్పిన్‌కు అనుకూలించడంతో భారత్ ఏకంగా నలుగురితో బరిలోకి దిగింది. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.. స్పిన్ ఆల్‌రౌండర్లుగా రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఆకట్టుకున్నారు. టోర్నీలో భారత్ స్పిన్నర్లు 26 వికెట్లు తీశారు. ఛాంపియన్స్ ట్రోఫీలో స్పిన్నర్లు ఎక్కువగా బౌలింగ్ చేయడంతో కీపర్ కేఎల్ రాహుల్ కష్టపడాల్సి వచ్చింది.
వికెట్స్ వెనకాల తాను ఎలా కష్టపడ్డాడనే దానిపై జస్ప్రీత్ బుమ్రా సతీమణి, టీవీ ప్రజెంటర్ సంజనా గణేశన్‌కు కేఎల్ రాహుల్ వివరించాడు. మ్యాచ్ అనంతరంరాహుల్ను సంజనా ఇంటర్వ్యూ చేశారు. ఈ క్రమంలో వికెట్ల వెనకాల మీ అనుభవం ఎలా ఉంది అని సంజనా అడగ్గా.. దూలతీరిపోయింది అనే సమాధానం ఇచ్చాడు. ‘కీపింగ్ అంత జోక్ కాదు సంజనా. స్పిన్నర్ల బౌలింగ్‌లో వికెట్ల వెనుక 200-250 సార్లు కుర్చోవడం, లేవడం చేయాల్సి వచ్చింది. భారత స్పిన్నర్లు ఎంతో ప్రతిభావంతులు. దుబాయ్ మైదానంలోని పిచ్‌లు కూడా వారికి సహకరించాయి. పిచ్‌లు స్పిన్‌కు అనుకూలించడంతో.. స్టంప్స్ వెనక నాకు మరింత సవాలు ఎదురైంది. భారత స్పిన్నర్లు అద్భుతం. వారు బౌలింగ్ చేసిన విధానం, పరిస్థితులను ఉపయోగించుకున్న తీరు అసాధారణం’ అని రాహుల్ చెప్పుకొచ్చాడు.
‘ఐసీసీ టోర్నీల్లో విజేతగా నిలవడం అంత సులువు కాదు. ఇది నాకు మొదటి ఐసీసీ టైటిల్ కాబట్టి చాలా సంతోషంగా ఉన్నా. ఇది జట్టు విజయం. అందరూ బాగా ఆడారు. నేను గత సంవత్సర కాలంగా బాగా కష్టపడ్డాను. ఎంతో శ్రమించాను. ఫలితం ఇప్పుడు వచ్చినందుకు ఆనందంగా ఉంది’ అని కేఎల్ రాహుల్ తెలిపాడు. ప్రధాన కీపర్ రిషబ్ పంత్ ఉన్నా.. రోహిత్ మాత్రం రాహుల్పై నమ్మకం ఉంచాడు.