అఖిల్ రాజ్, తేజస్విని ప్రధాన పాత్రల్లో నటించిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈటీవీ విన్ ప్రొడక్షన్స్ పతాకంపై సాయిలు కంపాటి దర్శకత్వంలో, డా. నాగేశ్వరరావు పూజారి సమర్పణలో, వేణు ఊడుగుల – రాహుల్ మోపిదేవి నిర్మించిన ఈ చిత్రం ముఖ్యంగా యూత్ కి బాగా కనెక్ట్ అయ్యింది. కంటెంట్ బాగుంటే ఎలాంటి మూవీ అయిన ప్రేక్షకులు ఆదరిస్తారు అని ‘రాజు వెడ్స్ రాంబాయి’ నిరూపించింది. అయితే ఈ మూవీలో విశేషంగా ఆకట్టుకున్న క్యారెక్టర్ అంటే చైతన్య జొన్నలగడ్డ చేసిన దివ్యాంగుడు వెంకన్న పాత్ర అని చెప్పాలి. హీరోయిన్ తండ్రిగా విలన్ గా.. మొదటి సినిమా అయినా చాలా బాగా యాక్ట్ చేసి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చైతన్య తన అనుభవాన్ని వివరించారు.
Also Read : iBomma Ravi : ఐబొమ్మ రవి ఐదోరోజు కస్టడీ విచారణ.. కీలక విషయాలు బయటకు
“బబుల్ గమ్, హిట్ 3 వంటి సినిమాల్లో నేను నటించిన చాలా మందికి తెలియదు. కానీ ‘రాజు వెడ్స్ రాంబాయి’ ద్వారా నాకు వచ్చిన స్పందన ఎంతో ప్రత్యేకం. దివ్యాంగుడిగా కనిపించే వెంకన్న పాత్ర నా కెరీర్‌లో కొత్త ఛాలెంజ్. ఈ పాత్ర కోసం నిజంగానే చీకట్లో కుంటడం ప్రాక్టీస్ చేశాను,” అని తెలిపారు. అదే సమయంలో తనకు సిద్ధు జొన్నలగడ్డ తో ఉన్న బంధాన్ని ప్రస్తావిస్తూ.. “సిద్ధు నా అన్నయ్య లాంటి వ్యక్తి. కానీ ఆయన పేరు ఉపయోగించి నా అవకాశాలు చేసుకోవాలన్న ఆలోచన నాకు లేదు. సినిమా ప్రమోషన్లలో సిద్ధును ఉద్దేశపూర్వకంగా పిలవలేదు. ఎవరి సహాయం లేకుండా నేను నా ప్రతిభతో నిలబడాలని అనుకున్నాను. అయినా సినిమా చూసిన తర్వాత సిద్ధు ప్రత్యేకంగా మెసేజ్ చేసి, నా నటనపై ఎంతో ప్రేమగా ప్రశంసించాడు” అని చెప్పారు. చైతన్య ప్రస్తుతం పవన్ సాధినేని దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆకాశంలో ఒక తార’ చిత్రంలో నటిస్తున్నారు. ఇదే దర్శకుడి వద్ద హీరో రాజశేఖర్ నటిస్తున్న ‘మగాడు’ చిత్రంలో కూడా ఆయన ఒక కీలక పాత్ర పోషించారు. భవిష్యత్తులో సిద్ధు తో కలిసి నటించే అవకాశం పై స్పందిస్తూ.. “ఒప్పందం వస్తే తప్పకుండా కలిసి పనిచేయాలని ఉంది. ప్రేక్షకులు కూడా ఆ కాంబినేషన్‌ను ఇష్టపడతారని నమ్ముతున్నాను,” అని అన్నారు.